నీతులు చెప్పే బాబుకు పిల‌వ‌టం కూడా రాదా?

Update: 2017-08-27 05:08 GMT
నోరు తెరిస్తే చాలు నీతులు చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల‌కు.. చేత‌ల‌కు అస్స‌లు సంబంధ‌మే ఉండ‌దు. పేరుకు ప్ర‌జ‌ల కార్య‌క్ర‌మంగా చెబుతూ.. దానికి ధ‌ర్మ‌క‌ర్త‌గా తాను వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెప్పే చంద్ర‌బాబు చేత‌ల్లో ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంక‌య్య‌కు ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఏపీ స‌ర్కారు పౌర‌స‌న్మానాన్ని నిర్వ‌హించింది. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం మొత్తం తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో ఒక పార్టీ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పించేలా చేయ‌టం క‌నిపించింది.

కాకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కొంద‌రు బీజేపీ నేత‌లు త‌ప్పించి మిగిలిన‌దంతా బాబు బ్యాచ్ తోనే నిండిపోయింది. పౌర‌స‌న్మానం అంటూ భారీగా ఖ‌ర్చు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎందుకు హాజ‌రు కాలేద‌న్న‌ది ఒక క్వ‌శ్చ‌న్‌. ఈ ప్ర‌శ్న‌ను ఏ అధికార‌ప‌క్ష నేత‌కు వేసినా.. అంతేనండి.. మా బాధ్య‌త మేం పిలిచాం. కానీ.. ఆయ‌న మాత్రం రాలేదంటూ నిష్టూరాలు ఆడ‌టం క‌నిపిస్తుంది.

ఉప‌రాష్ట్రప‌తికి పౌర‌స‌న్మానం చేసే కార్య‌క్ర‌మానికి పిలిచినా విప‌క్ష నేత జ‌గ‌న్ రాక‌పోవ‌టం ఏమిటి? అని అనిపిస్తుంది. కానీ.. కాస్తంత లోతుగా చూస్తే అస‌లు విష‌యం అర్థం కావ‌ట‌మే కాదు.. మ‌ర్యాద‌రామ‌న్న మాదిరి త‌ర‌చూ సుద్దులు చెప్పే చంద్ర‌బాబు అస‌లు రంగు కూడా బ‌య‌ట‌ప‌డిపోతుంది. వెంక‌య్యకు నిర్వ‌హించిన పౌర‌స‌న్మానం కార్య‌క్ర‌మం డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కానీ.. ఒక్క రోజంటే ఒక్క రోజు ముందుగా అది కూడా శుక్ర‌వారం సాయంత్రం ఈ మొయిల్ రూపంలో ఆహ్వానం పంప‌టం బాబు అండ్ కోకు మాత్రమే సాధ్య‌మ‌వుతుంది.

గౌర‌వంగా పిల‌వాల‌నుకునే వారు పిలిచే ప‌ద్ధ‌తి ఇది కాద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. విప‌క్ష నేత పౌర‌స‌న్మానం కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన బాబు తీరు చూస్తే.. ఆయ‌న మాటల్లో క‌నిపించే పెద్ద‌రికం చేత‌ల్లో మాత్రం అస్స‌లు క‌నిపించ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదేమీ తెలీని వారు.. టీడీపీ నేత‌లు చెప్పే మాట‌లు విన్న వారికి మాత్రం జ‌గ‌న్ పౌర స‌న్మాన కార్య‌క్ర‌మానికి రాలేద‌నే త‌ప్పించి.. పిలుపుల విష‌యంలో ఆయ‌న్ను అవ‌మానించిన తీరు మాత్రం ఎంత‌కూ అర్థం కాదు. 
Tags:    

Similar News