కేంద్రం వంచిస్తున్నా బాబు అడగరంతే!

Update: 2017-09-16 03:59 GMT
కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ ను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. విభజన చట్టం ప్రకారం.. విజయవాడ, విశాఖ పట్నంలలో మెట్రో రైలు నిర్మాణానికి  కేంద్రం నిధులు సమకూర్చవలసిన బాధ్యత ఉన్నప్పటికీ.. ఆ విషయంలో కప్పదాటుకు పాల్పడుతోంది. విభజన చట్టంలో ఏపీ  ప్రయోజనాలను కాపాడడానికి ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ... ఇప్పుడు కొత్త నిబంధనలను, ఇతరత్రా అంశాలను సాకులుగా చూపిస్తూ.. ఎగవేయడానికి ప్రయత్నిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రత్యేకహోదా విషయంలోనే కేంద్రం వంచించినప్పుడు.. కనీసం వారిని గట్టిగా అడిగే ప్రయత్నం కూడా చేయకుండా నీరుగార్చిన చంద్రబాబునాయుడు సర్కారు... కేంద్రం మెట్రో రైలు వ్యవహారంలో చేస్తున్న తాజా మోసాల గురించి ప్రశ్నించే ఉద్దేశంతో లేనట్లుగా కనిపిస్తున్నారు.

కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాలను రాబట్టుకోవడంలో చంద్రబాబునాయుడు సర్కారు దారుణంగా విఫలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు ఎన్ని రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు సర్కారు వీసమెత్తు కూడా పట్టించుకోవడం లేదు. విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం.. విజయవాడ - విశాఖల్లో మెట్రో రైల్ నిర్మాణాలు జరగాల్సి ఉంది.

అయితే ఇప్పుడు విజయవాడ స్థాయికి లైట్ మెట్రో సరిపోతుందని, మెట్రో అనవసరం అని కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మెట్రోకు చాలినంత జనాభా లేరని అంటోంది. అయితే ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి  రూపుదిద్దుకుంటున్న తరుణంలో గుంటూరు – అమరావతి- విజయవాడ నగరాలు కలిపి ఈ స్థాయిని అందుకోగలవని ప్రతిపాదించి... కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం అవుతోంది.

అసలే లైట్ మెట్రో అనేది మన ప్రాంతానికి అనువైన మోడల్ కాదని.. మెట్రో రైల్ రంగంలో ఉద్ధండుడు అయిన శ్రీధరన్ ఎప్పుడో హెచ్చరించారు. అయితే మంత్రి నారాయణ మాత్రం.. ప్రపంచంలో అనేక చోట్ల లైట్ మెట్రోలే నడుస్తున్నాయంటూ.. డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. కేంద్రాన్ని విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన సాయం ఇవ్వాలని గట్టిగా అడగలేక, చంద్రబాబు సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News