సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాట ?

ఏపీలో వైసీపీ హయాంలో రెండు కీలక వ్యవస్థలను ఎర్పాటు చేసింది.

Update: 2025-01-14 03:50 GMT

ఏపీలో వైసీపీ హయాంలో రెండు కీలక వ్యవస్థలను ఎర్పాటు చేసింది. అవి జగన్ మానస పుత్రికలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు వ్యవస్థల మీద వైసీపీ ముద్ర బలంగా ఉంది. ఎంతలా అంటే చెరిగివేయలేనంతగా. ఆ రెండే వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ.

ఇద్నులో ఒకటి టెంపరీ బేసిస్ లో నియమితులైన వాలంటీర్ల వ్యవస్థ. వీరు రెండు లక్షల యాభై వేల మందికి పైగా నాడు రిక్రూట్ అయ్యారు. గౌరవ వేతనం అయిదు వేలుగా చెల్లిస్తూ 2019 ఆగస్టు 15 నుంచి వీరిని విధులలోకి తీసుకున్నారు. అయితే వీరికి పది వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని కూటమి పెద్దలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.

తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టారు అన్న విమర్శలు వచ్చాయి. ఆరేడు నెలలుగా వారంతా రోడ్ల మీదకు వచ్చి తమకు విధులలోకి తిరిగి తీసుకోమని కోరారు. అయినా వారి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా రియాక్ట్ కాలేదు సరికదా వైసీపీ వారిని రెన్యూల్ చేయలేదని వారు ప్రభుత్వ విధులలో లేరని తోసిపుచ్చింది. అలా వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా పోయినట్లు అయింది.

ఇపుడు చూస్తే రేషనలైజేషన్ ప్రక్రియ పేరుతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇపుడున్న రూపాలలో వారు ఉండేది లేకుండా సమూలంగా మార్పులు తెస్తారు అని అంటున్నారు. ఈ రేషనలైజేషన్ ప్రక్రియతో ఉద్యోగుల సంఖ్య కుదింపు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ప్రతీ రెండు వేల అయిదు వందలమందికి ఒక సచివాలయమని అది కూడా ఆరుగురు మాత్రమే సిబ్బంది అని చెప్పడంతో సచివాలయ ఉద్యోగులు అంతా ఆందోళన చెందుతున్నారు

తన జీవితాలు ఏమి అవుతాయో అన్న కలవరం వారితో ఉంది. ఇప్పటికే తాము ఎంతో పెద్ద చదువులు చదివి జగన్ ప్రభుత్వం నాడు సర్కార్ ఉద్యోగాలు అంటే ఆశతో చేరామని వారు అంటున్నారు. అయితే ఎదుగూ బొదుగూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు అవునో కాదో తెలియకుండా తమను త్రిశంకు స్వర్గంలో ఉంచారని వారు వాపోతున్నారు.

ఈ కారణంగానే సచివాలయ ఉద్యోగులలో అత్యధిక శాతం ఆనాడు వైసీపీని వ్యతిరేకించి కూటమిని గెలిపించారు అన్న ప్రచారం ఉంది. అయితే ఇపుడు కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ పేరుతో ఏమి చేస్తుందో అన్నదే వారికి కంగారుగా ఉంది. తమ ఉద్యోగాల విషయంలో కానీ సచివాలయ వ్యవస్థలో చేపట్టే ఏ రకమైన మార్పుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కీలక చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు.

అంతే కాకుండా తమలో ఉన్నత చదువుకుని సీనియారిటీ ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద లక్షా ముప్పయి వేల మంది దాకా ఉన్న సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఒక ఐక్య కార్యాచరణని సైతం వారు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం కనుక ఏకపక్షంగా రేషనలైజేషన్ ప్రక్రియని చేస్తే ఉద్యమించాలని కూడా నిర్ణయించారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News