సైకిల్ ఎక్కే ‘ఆనం’ బ్రదర్స్ కు బాబు ఇచ్చేదేమిటి?

Update: 2015-11-26 06:24 GMT
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్న వారు ఉండరు. అంతా కాలానికి తగినట్లుగా వ్యవహరించే వారే. దాదాపు పాతికేళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక పరిస్థితుల్లో వదిలేయాలని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ డిసైడ్ అయ్యారు. ఇంతకాలం అభయ హస్తం నీడలో ఉన్న వారు.. ఇంత సుదీర్ఘకాలం తర్వాత వారు.. టీడీపీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆసక్తికరమైన ఈ నిర్ణయానికి రాష్ట్ర విభజనే కారణంగా చెప్పాలి.

విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నూకలు చెల్లిపోవటం.. సమీప భవిష్యత్తులో పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేకపోవటం.. విపక్షం పరిస్థితి అయోమయంగా మారటం.. నెల్లూరు జిల్లాలో ఉన్న పరిమితుల కారణంగా.. చివరకు ఆనం బ్రదర్స్ తెలుగుదేశంలోకి రావటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబందించిన రహస్య చర్చలు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.

పార్టీకి వచ్చే ఆనం బ్రదర్స్ కోసం రెండు పదవుల్ని సైతం చంద్రబాబు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత మరోసారి తెలుగుదేశం పార్టీకి తిరిగి వస్తున్న ఆనం బ్రదర్స్ కు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా చూడాలన్న మాటను పార్టీ వర్గాలకు  బాబు ఇప్పటికే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆనం బ్రదర్స్ (పెద్దాడు ఆనం వివేకానంద రెడ్డి.. చిన్నాడు ఆనం రాంనారాయణ రెడ్డి) తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ సర్కారులోనూ.. ఆ తర్వాత రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలోనూ చిన్నవాడైన ఆనం రాంనారాయణ రెడ్డి మంత్రి పదవులు నిర్వహించారు. విభజన నేపథ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లగా ఉన్న ఆనం బ్రదర్స్ తాజాగా టీడీపీలో చేరిపోవాలని... అందుకు డిసెంబరు 5న ముహుర్తంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పార్టీలోకి వస్తున్న పెద్దవాడైన ఆనం వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతలు.. చిన్నోడైన ఆనం రాంనారాయణ రెడ్డికి.. పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఆనం బ్రదర్స్ రాక నెల్లూరు జిల్లా టీడీపీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News