తన దాకా వస్తే కానీ....

Update: 2018-11-16 11:57 GMT
మొదట వాళ్ళు గాలి జనార్ధన్ రెడ్డి పై పడ్డారు
చంద్రబాబు స్పందించలేదు.. అతను తన పార్టీ కాదని
తర్వాత వాళ్ళు వైఎస్ జగన్ మీద పడ్డారు
చంద్రబాబు స్పందించలేదు.. అతను ప్రత్యర్థి పార్టీ కాబట్టి
ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు మీద పడ్డారు
ఆయన కోసం నోరెత్తేవాళ్ళెవరూ మిగల్లేదు

నాజీలు చెలరేగి ఒక సమూహం తర్వాత మరో సమూహాన్ని మట్టు పెడుతున్న సమయంలో జర్మన్ మేధావుల నిర్లిప్తత గురించి మార్టిన్ నీమోలర్ రాసిన ఫేమస్ పోయమ్ ఇది. ఇది రాసిన ఉద్దేశం వేరే కానీ.. దీన్ని ఎపిలో చంద్రబాబుకు కూడా అన్వయించుకోవచ్చు ఇప్పుడు.. తన దాకా వస్తే కానీ.. తెలియదన్నట్లు.. ఇంత కాలం వేధింపుల కోసం.. ప్రతిపక్షాలపైన రకరకాల కేసుల పేరుతో సిబిఐ దాడులను చూస్తూ మురుస్తున్న చంద్రబాబుకు ఇలాంటి రోజొకటి వస్తుందన్న ధ్యాసే లేదు.. తీరా అలాంటి రోజు వస్తుందని తెలిశాక.. ఏం చేయాలో పాలు పోక.. ఏకంగా సిబిఐ నే తన రాష్ర్టంలో నిషేధించటానికి పూనుకున్నాడు.. రాజకీయ నాయకులన్నాక అవినీతి ఆరోపణలు రాకుండా ఉండవు.. కేసులు రిజిస్టరవ్వక మానవు..  పట్టుబడేంత వరకే ఎవరైనా పతివ్రతలన్నట్లు.. దర్యాప్తులు - దాడులు మొదలు కానంత వరకే ఎవరైనా.. ఇప్పుడు ఒకదాని వెంట మరొకటి కేసులు - దర్యాప్తులు చుట్టుముట్టే పరిస్థితి కనిపించడంతో.. దారులన్నీ మూసుకుపోయిన చంద్రబాబు చివరకు నిషేధమనే అస్ర్తాన్ని సంధించారు.. నిజానికి కోర్టుల ముందు ఈ అస్ర్తం నిలబడేదేం కాదు.. అయినా ఇప్పుడాయన ఉన్న పరిస్థితిలో ఇంతకంటే మార్గం లేదేమో మరి.. ఓ వైపు రాష్ర్టంలో దగ్గర పడుతున్న ఎన్నికలు.. మరో వైపు పాదయాత్రతో జనంలో కి దూసుకుపోతన్న ప్రత్యర్థి.. రోజు రోజుకు పడిపోతున్న తన ఇమేజ్ గ్రాఫ్.. నిన్నామొన్నటి దాకా కేంద్రంతో ఉన్న సంబంధాలు నేడు చేతులారా పోగొట్టుకున్న పరిస్థితి.. దీనికి తోడు సిబిఐ బూచి భయపెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. ఆయన తీసుకున్న నిర్ణయం పర్యవసానం ఎలా ఉండబోతుందో ముందుముందు జనమంతా చూడనున్నారు..

Tags:    

Similar News