బావమరిదికి బాబు ఝలక్ ఇచ్చారే!

Update: 2017-09-09 08:42 GMT
నందమూరి కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు మొండి చేయి చూపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో అంటే 2009 సాధారణ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవాను తట్టుకోవడానికి, తన ప్రయోజనాల కోసం నందమూరి కుటుంబాన్నిదగ్గరకు తీసుకోవాలని బాబు నిశ్చయించుకున్నార‌న్న వాద‌న వినిపించింది. అప్పటివరకు ఆ కుటుంబం పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా బాబు జాగ్రత్త పడ్డాడన‌ట్లు కూడా నాడు చెప్పుకున్నారు. అయితే నందమూరి కుటుంబాన్నిదూరం పెడుతున్నారని పార్టీలోనూ, బయటా విమర్శల జడివాన కురవడంతో ఆ కుటుంబాన్నిఅక్కున చేర్చుకోక తప్పలేదు.

ఈ క్రమంలో తన బావమరిది - సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూతురిని తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. మరికొన్నాళ్లకు తన మేనకోడలు కుమార్తె ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కు వివాహం జరిపించారు. అంతేకాకుండా తన మరో బావమరిది - నందమూరి హరికష్ణను రాజ్యసభకు పంపారు. అయితే ఆయన 2014లో రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటికి ఆయన పదవీకాలం ఇంకా దాదాపు ఏడాది ఉందనుకోండి అది వేరే విషయం.

ఇక అప్పటి నుంచి అంటే దాదాపు మూడేళ్ల నుంచి ఏ పదవీ లేకుండా ఖాళీగా కూర్చున్న హరికష్ణకు ఎలాంటి పదవీ అప్పగించలేదు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి రాష్ర్టంలో - బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా హరికి ఒరిగిన ప్రయోజనం శూన్యం. బాలయ్యకు మాత్రం హిందూపూర్ నుంచి ఎమ్మేల్యే టికెట్ ఇచ్చారు. హరికష్ణ మాత్రం చకోర పక్షిలా తనకు ఏదో ఒక పదవీ రాకపోతుందా అని ఎదురుచూశారు. అయితే వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన బాబు ఆయనవైపు కన్నెత్తి చూడలేదన్న వాద‌న వినిపించింది. హరి కూడా తన పెద్ద కుమారుడు ప్రమాదంలో మరణించడంతో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు.

మళ్లీ ఈ మధ్యకాలం నుంచి టీటీడీ.. అదేనండి.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాధ్యతలు చేపట్టాలని హ‌రికృష్ణ‌ తెగ ఉబలాటపడ్డారు. బాబు కూడా ఇస్తానన్నారనే వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే ఇంతలో ఏమైందో కానీ నిన్న(శుక్రవారం) టీటీడీ చైర్మన్ గా మదనపల్లికి చెందిన పారిశ్రామికవేత్త రవిశంకర్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. దీంతో అంతా భ్రాంతియేనా? జీవితాన వెలుగే లేదా? ఆశ.. నిరాశేనా? అని హరికృష్ణకు పాడుకోక తప్పేలా లేదు.
Tags:    

Similar News