ఎన్టీఆర్ కుమార్తెను బాబు ఎలా పెళ్లాడారంటే?

Update: 2018-02-28 05:28 GMT
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 40 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఒక పెద్ద పండ‌గ‌నే చేసేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు. నిత్యం ఏదో ఒక హ‌డావుడి చేసేందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించే ఆయ‌న‌.. త‌న 40 ఏళ్ల పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీని భారీ వేడుక మాదిరి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. సాధార‌ణంగా బాబు అన్నంత‌నే.. సీరియ‌స్ గా.. బోరింగ్ గా సాగే అంశాలు ఉంటాయి.

అందుకు భిన్నంగా వీలైనంత‌వ‌ర‌కూ బాబు వ్య‌క్తిగ‌త విష‌యాలు.. బ‌య‌ట‌కు పెద్ద‌గా రాని అంశాల మీద దృష్టి పెట్టిందో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌. ఆ మీడియా సంస్థ య‌జ‌మానే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో ముఖ్య‌మైంది చంద్ర‌బాబు పెళ్లి ఘ‌ట్టం.

అస‌లు చంద్ర‌బాబు లాంటి నేత‌కు ఎన్టీఆర్ త‌న కుమార్తెను ఎందుకు ఇవ్వాల‌నుకున్నారు? ఆ సంబంధం ఎలా వ‌చ్చింది?  పెళ్లి చూపుల సంద‌ర్భంలో భువ‌నేశ్వ‌రికి చంద్ర‌బాబు చెప్పిందేమిటి?  పెళ్లి వేళ ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు అడిగిందేమిటి?  పెళ్లి మాట‌ల సంద‌ర్భంలో బాబు ప్ర‌ద‌ర్శించిన బెట్టు ఏమిటి? అన్న విష‌యాల్లోకి వెళితే..

చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా గెలిచి అంజ‌య్య కేబినెట్ లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ కుమారుడు జ‌య‌కృష్ణ ఎగ్జిబిట‌ర్‌. ఈ నేప‌థ్యంలో మంత్రి అయిన చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు జ‌య‌కృష్ణ అప్పుడ‌ప్పుడు వ‌చ్చే వారు. ఆ టైంలో ఎన్టీఆర్ ను క‌ల‌వాల‌ని జ‌య‌కృష్ణ‌ను కోరారు చంద్ర‌బాబు. అందుకు స‌రేన‌న్న ఆయ‌న‌.. అనురాగ దేవ‌త షూటింగ్ టైంలో ఎన్టీఆర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు.

మంత్రి హోదాలో త‌న‌ను క‌లిసిన చంద్ర‌బాబును ఎన్టీఆర్ గౌర‌వంతో కూర్చొబెట్టి.. గంట‌న్న‌ర‌సేపు మాట్లాడారు. ఆ సంద‌ర్భంలో రాజ‌కీయాల్లోకి వచ్చే అవ‌కాశం ఉందా? అని చంద్ర‌బాబు అడిగారు. త‌న‌కు మ‌రో ఏడాదిన్న‌ర‌లో 60 ఏళ్లు వ‌స్తాయ‌ని.. ఆ త‌ర్వాత తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌నుకున్న‌ట్లుగా ఎన్టీఆర్ చెప్పిన‌ట్లుగా బాబు చెప్పారు.

తాను మంత్రిగా ఉన్న వేళ ఎన్టీఆర్ ను క‌ల‌వ‌టంతో కారు దాకా వ‌చ్చి వీడ్కోలు ప‌లికేందుకు ఎన్టీఆర్ సిద్ధ‌మైతే.. నేను పిల్లాడ్ని..మీరు రావ‌టం ఎందుకంటూ తానే ఆయ‌న్ను సెట్ వ‌ద్ద వ‌దిలిపెట్టి వ‌చ్చాన‌న్నారు. త‌ర్వాతి కాలంలో వీర బ్ర‌హ్మం గారి చ‌రిత్ర షూటింగ్ లోనూ క‌లిసి మాట్లాడుకున్నామ‌న్నారు. త‌మ బంధ‌వులు.. ఎన్టీఆర్ బంధువులు ఒక‌టే కావ‌టం..జ‌య‌కృష్ణ ద్వారా పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను ఎన్టీఆర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ ఇంటి సంబంధం కావ‌టం.. తాను యూత్ లో ఉండ‌టంతో కాస్త బెట్టు చూపించాన‌న్నారు. ఇంట్లో అడిగి చెబుతాన‌ని చెప్పి కొంత టైం తీసుకొని అంగీక‌రించిన‌ట్లుగా చెప్పుకున్నారు.

పెళ్లిచూపుల్లో భువ‌నేశ్వ‌రితో తాను మాట్లాడాన‌ని.. త‌న ప‌రిస్థితి వివ‌రించిన‌ట్లుగా బాబు చెప్పారు. తాను పెరిగిన గ్రామీణ నేప‌థ్యంలో గురించి చెప్ప‌టంతో పాటు.. మీ కుటుంబ నేప‌థ్యం వేరు.. మాది వేర‌ని చెప్పాన‌ని.. త‌న‌కు ప‌ద‌వి పోతే మ‌ళ్లీ ప‌ల్లెకు పోవాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించిన ఆయ‌న‌.. అన్ని చెప్పాక తానూ ఓకే చెప్పార‌న్నారు. ఎన్టీఆర్ ను చూడ‌ట‌మే మ‌హాద్బాగ్యం అనుకునే వేళ‌.. ఏకంగా ఆ వ్య‌క్తే  కాళ్లు క‌డిగి క‌న్యాదానం చేయ‌టం ఒక అనుభూత‌న్నారు చంద్ర‌బాబు.

ఎన్టీఆర్ అప్ప‌టికే టాప్ లో ఉన్నార‌ని.. త‌న అర్హ‌తంతా తాను మంత్రిగా ఉండ‌ట‌మేన‌న్న బాబు.. డ‌బ్బులు అక్క‌ర్లేదు కానీ పెళ్లి మాత్రం ఘ‌నంగా చేయాల‌ని కోరిన‌ట్లుగా చెప్పారు. ఏపీ.. త‌మిళ‌నాడుకు చెందిన నేత‌లు.. సినిమావాళ్లు ఢిల్లీ పెద్ద‌లు చాలామంది వ‌చ్చార‌ని.. సినిమావాళ్లు వ‌డ్డించార‌ని.. మంత్రిగా యువ‌నేత‌గా పాపుల‌ర్ కావ‌టం..తాను చిత్తూరు జిల్లాలో పెళ్లికార్డు ఇవ్వ‌టంతో జ‌నాలు పోటెత్తార‌న్నారు. పెళ్లివేళ జ‌న‌స‌మూహాన్ని నిలువ‌రించ‌టం క‌ష్ట‌మైంద‌న్నారు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడు అన్ని వేషాలు వేసిన‌ట్లు చెప్పిన చంద్ర‌బాబు..సిగిరెట్ తాగేవాడిన‌ని చెప్పారు. గ‌తంలో పేకాట ఆడేవాడిన‌ని.. బాగా డ‌బ్బులు సంపాదించేవాడిన‌ని చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. పేకాట ఆడ‌టానికి చాలా ఏకాగ్ర‌త‌.. కాలుక్యుషేన్ అవ‌స‌ర‌ని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News