అదీ చంద్రబాబు స్టైల్ అంటే..

Update: 2018-03-03 04:24 GMT
ఆయన స్వతహాగా అలవిమాలిన జాప్యం చేస్తుంటారు... కానీ చాలా తెలివిగా దాన్ని ప్రజల మీదికి నెట్టేస్తుంటారు. ప్రజల కోసమే ఇలా జాప్యం జరుగుతున్నదని చాలా నమ్మబుల్ గా ప్రజలు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో సెలవిస్తుంటారు. చంద్రబాబునాయుడు ఆ మార్కు తెలివితేటలను మరోమారు ప్రదర్శిస్తున్నారు.  కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే తప్ప.. రాష్ట్రప్రయోజనాలు సాధించే విషయంలో వారిపై ఒత్తిడి పెంచడం అసాధ్యం అని అందరూ భావిస్తున తరుణంలో.. ‘తెంచేసుకుంటాం’ అని నెల రోజులుగా చెబుతున్న ముఖ్యమంత్రి.. ఇప్పటికీ నిర్ణయానికి రావడం లేదు.. తాజా సమావేశంలో కూడా.. రాజీనామాలు చేయడానికి మేం రెడీ అని కేంద్రమంత్రులు అంటోంటే.. ‘వద్దొద్దు..  అంత పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం.. మళ్లీ మనం రాజీనామాలు చేసేసిన తర్వాత.. మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం అని ప్రజలు అనుకోకూడదు’ అంటూ చంద్రబాబునాయుడు బుకాయిస్తున్నారు.

అయినా చంద్రబాబు గారూ.. ప్రజలందరూ తమరు ఎప్పుడెప్పుడు రాజీనామాలు చేస్తారా? క్రియాశీలంగా పోరాటంలోకి వస్తారా? అని ఎదురుచూస్తున్నారు. మీరు కేంద్రంలోభాగంగానే ఉంటూ రాజీనామాలు చేయకపోవడం వల్లనే.. మీరు సరిగా పోరాడక, పోరాడే వాళ్లకు మద్దతివ్వక ప్రత్యేక హోదా డిమాండు గానీ, రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాలు గానీ.. ఉభయ భ్రష్టత్వం పట్టిపోతున్నాయని ప్రజలు కుమిలిపోతున్నారు.

చంద్రబాబుకు తన కేంద్ర మంత్రుల ద్వారా చక్కబెట్టుకోవాల్సిన రాచకార్యాలు ఏమైనా ఉంటే వారు నిరభ్యంతరంగా చక్కబెట్టుకోవచ్చు. అంతే తప్ప.. అందుకోసం.. ప్రజలను నెపంగా చూపి.. వారు తమను ‘తొందర పాటు’ అంటారు అంటూ బూచిలా ప్రచారం చేసి.. పదవుల్లో ఊరేగడం కరెక్టు కాదు అని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News