మోడీ దగ్గరకు వాళ్లను తీసుకెళ్లచ్చుగా బాబు..?

Update: 2015-05-25 12:14 GMT
విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చటంలో కేంద్రం పట్టించుకోవటం.. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఏపీని ఆదుకుంటామని మాటలు చెబుతూనే.. ఏపీకి ప్రత్యేకహోదా విషయంపై కప్పదాటేసే ప్రయత్నాలు చేయటం తెలిసిందే.

        ఈ నేపథ్యంలో.. ఏపీ అధికారపక్ష నేతలు అప్పుడప్పుడు ప్రత్యేకహోదాకు సంబంధించి గళం విప్పటం చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రానికి కోపం రాకుండా ఉండేందుకు.. కేంద్రమంత్రులుగా వ్యవహరిస్తున్న అశోక్‌ గజపతిరాజు లాంటి వారు కేంద్రానికి తగ్గట్లు సన్నాయి నొక్కులు నొక్కటం తెలిసిందే.

        విభజన కారణంగా ఏపీకి ఎంతో నష్టం వాటిల్లిందని.. రాజధాని లేకుండా కట్టుబట్టలతో బయటకు పడేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారు అప్పుడప్పుడు గోడు వెళ్లబోసుకోవటం.. ఆయనలాంటి వ్యక్తి అంత బేలగా మాట్లాడటం చూసి అయ్యో పాపం అనుకునేవారు చాలామందే ఉన్నారు. మరి.. ఇంత బాధపడే వ్యక్తి.. ఏపీ హక్కుల కోసం ఎందుకు పోరాడరన్న విషయానికి సమాధానం చెప్పరు.

        కేంద్రంలో మోడీతో మిత్రత్వంలో తేడా వస్తుందని భావిస్తే.. తన పార్టీ నేతలతోనో.. ఆందోళనలతోనో ఒత్తిడి తీసుకురావటం పెద్ద విషయమేమీ కాదు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబుకు ఇవేమీ పెద్ద విషయాలు కావు. అయినప్పటికీ.. ఆయన మాత్రం అలాంటి విషయాల మీద దృష్టి సారించటం లేదు. ప్రత్యేకహోదా విషయంపై కేంద్రవైఖరిపై అసంతృప్తి ఇప్పటివరకూ వ్యక్తం చేసింది లేదు.

        తన చేతికి మట్టి అంటకూడదన్న ఉద్దేశ్యమే చంద్రబాబుకు ఉన్నా మరోలా వ్యవహరించే అవకాశం కాచుకు కూర్చుంది. ప్రత్యేకహోదా అంశంపై రాష్ట్ర సర్కారు నేతృత్వంలో అఖిలపక్షం.. ప్రధానమంత్రిని కలిపించటం. ఇదే విషయంపై తాజాగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. చాలా అంశాల మీద కేంద్రం వద్దకు అఖిలపక్షాలు వెళుతుంటాయి. వెళ్లిన ప్రతిఒక్కరి డిమాండ్లు తీర్చే పరిస్థితి ఉండదు.

        ఈ విషయం అధికారపక్షానికే కాదు.. విపక్షాలకు కూడా బాగానే తెలుసు.  అయినప్పటికీ.. ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా.. బాబు మాత్రం స్పందించటం లేదు. ప్రత్యేకహోదా విషయంలో నాన్చే కొద్దీ.. నష్టం అధికారపక్షానికే అన్న విషయం బాబు మర్చిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకహోదా అంశం మీద ఒక బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళితే.. విపక్షాలతో పాటు.. ఏపీ ప్రజలకు ఎంతోకొంత సంతృప్తి కలగటం ఖాయం. మరి.. అందరిని సంతృప్తిపర్చే ఉద్దేశ్యం బాబుకు ఉందా? అన్నదే పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News