ఈ లెక్కాపత్రం లేని ఖర్చులేంది బాబు?

Update: 2017-03-26 05:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సినిమాలు చూపించటం కొత్తేం కాదు. తరచూ ఆయన చెప్పే మాటలు వింటూ.. వాస్తవాల్ని క్రాస్ చెక్ చేస్తేనే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. తనకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు.. రానున్న రెండేళ్లవ్యవధిలో అమరావతిలో ఆడ్మినిస్ట్రేటివ్ నగరిని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్న విషయాన్నిప్రజంటేషన్ రూపంలో వివరించారు. నిత్యం తన మాటలతో సినిమా చూపించే చంద్రబాబు అండ్ కోకు రాజధాని డిజైన్ల తయారీ చేస్తున్న లండన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ సంస్థ పలు నగరాల్లోని ప్రముఖ భవనాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. అమరావతి పరిపాలనా నగరానికి డిజైన్లను సిద్ధం చేసింది.

వీటిని తాజాగా ప్రజంటేషన్ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఉప ముఖ్యమంత్రులు.. స్పీకర్.. ఇతర మంత్రులతో పాటు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు  ప్రజంటేషన్ ప్రదర్శించారు. పరిపాలనా నగరంలో భాగంగా.. సెక్రటేరియట్.. అసెంబ్లీ భవనాల్ని నభూతో.. అన్నరీతిలో నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఈ నిర్మాణాల్ని 2018 డిసెంబరు నాటికి సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. ఇదంతా చూసినప్పుడు ప్రతి చిట్టి బుర్రకు బోలెడన్ని డౌట్లు వచ్చే పరిస్థితి.

27 కిలోమీటర్ల వ్యవధిలో అభివృద్ధి చేసే పరిపాలనా నగరిలో ఏర్పాటు చేసే భవనాల జాబితాను చూసినప్పుడు.. మరి.. ఇప్పటికే నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్.. తాత్కాలిక అసెంబ్లీ భవనాలకు పెట్టిన వందల కోట్ల రూపాయిల ఖర్చు మాటేమిటన్నసందేహం కలగక మానదు. ఇదే సందేహాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం రాని పరిస్థితి.

ఇలాంటి ప్రశ్నలెన్నో.. ప్రజంటేషన్ చూస్తున్నప్పుడు మనసులోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. హడావుడి భవనాలు నిర్మించటమే లక్ష్యంగా కాకుండా.. మరికాస్త మధనం జరగటం.. మిగిలిన విపక్షాలతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్మాణం జరిపితే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణరాష్ట్రంలో చోటు చేసుకుంటున్నప్రస్తుత పరిణామాలే దీనికి నిదర్శనం.

వైఎస్ హయాంలో బ్రహ్మాండమైన సీఎంక్యాంప్ ఆఫీస్ నిర్మించారు. నగరం నడిబొడ్డున ఉండే ఈ భవనంలో వాస్తు బాగోలేదంటూ..వందల కోట్ల రూపాయిల ఖర్చుతో (?) మరో భారీ హంగులున్న భవనాన్ని నిర్మించటాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికే ఒక భవనం ఉంటే.. వసతులకు సరిగా లేవన్న పేరుతో మరో భవనాన్ని నిర్మించారు. దీనివల్ల వృధా అయిన ప్రజధనం గురించి కేసీఆర్ అస్సలు మాట్లాడరు.

ఏపీ విషయనికి వస్తే.. ఇప్పటికే తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్.. అసెంబ్లీభవనాల్నినిర్మించటాన్ని మర్చిపోకూడదు. ఇవి సరిపోనట్లు మళ్లీ పర్మినెంట్ అంటూ కొత్త నిర్మాణాల్నినిర్మించటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా చేపడుతున్న నిర్మాణం అంతా బాబు అభిరుచి మేరకు సాగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం భారీగా ఉందనిచెప్పాలి.

ఒక రాజధాని నిర్మాణం లాంటి పెద్ద విషయాల్లోకి రాజకీయాన్ని పక్కన పెట్టేసి..వివిధ రాజకీయ పార్టీలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి..అందరికి ఆమోదయోగ్యమైన డిజైన్లను ఓకే చేయటం మంచిది. లేకుంటే.. రేపొద్దున చంద్రబాబు స్థానంలో వచ్చే మరొకరు. బాబు నిర్మాణాలకు భిన్నమైన నిర్మాణాల మీద దృష్టి సారిస్తే.. అప్పటికే పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు మాదిరి మారుతుందన్న విషయాన్నిమర్చిపోకూడదు. ఖర్చుల విషయంలో ఆచూతూచి అడుగులు వేయాల్సిన అవసరం బాబు మీదున్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోకూడదు. ఇందుకు సంబంధించిన ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఖర్చు భారం అంతిమంగా ప్రజల మీదనే ఉంటుందన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News