అసెంబ్లీ లో బాబు తొలి సంతకం అదిరిపోయింది

Update: 2017-03-02 10:19 GMT
న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని వెలగపూడిలో అసెంబ్లీ భవనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు,ఈ సంద‌ర్భంగా అసెంబ్లీలో తొలి ఆదేశాలపై సంతకం చేశారు.  తన ఛాంబర్‌లో ప్రవేశించి, ఆపై మొట్టమొదటి పైలు మీద సంతకం చేశారు. తొలిసారిగా సొంత అసెంబ్లీ భవనంలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు అదనంగా ఇస్తామన్న 50 వేల రూపాయల భత్యం ఫైలు మీద ఆయన సంతకం చేశారు. దీంతో మొత్తం ఎమ్మెల్యేలందరికీ ఈ కొత్త భవనం తాలూకు భత్యం అందనుంది.

కాగా, వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ - మండలి ఛైర్మన్‌ చక్రపాణి - మంత్రులు - ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఏపీ రాజధాని ప్రాంత‌ రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతి కావున రాజధానిగా ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొంతమంది అడ్డుపడుతూనే ఉన్నారని ఆరోపించారు. 33 వేల ఎకరాలు రాజధాని కోసం ఇవ్వడం విపక్షాలకు నచ్చట్లేదన్నారు. భూ యజమానులే స్వచ్ఛందంగా ఇస్తే వారికి ఇబ్బందేంటో అర్థం కావట్లేదన్నారు. ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలాలను ఇచ్చామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు తిరిగి ఇచ్చామన్నారు.ఏపీ రాజధాని అమరావతినే కాదు రాయలసీమనూ రతనాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర కూడా సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. ఇది భారత చరిత్రను తిరగరాసే క్షణమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేమని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విభజన చేసేటప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక్కమాట చెప్పలేదన్నారు. విభజన పట్ల ఇప్పటికీ నాకు తీవ్రమైన బాధ కలుగుతోందన్నారు. పోరాడినా ఫలితం లేక రాష్ట్ర ప్రజలు నీరసించిపోయారని తెలియజేశారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవద్దని చెప్పినా, ఎవరూ వినలేదన్నారు. మన అవమానాన్ని సానుకూలంగా మార్చుకుందామని సూచించారు. నా కష్టం, ప్రజల సహకారంతో ఏపీని మళ్లి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడో చెప్పలేదన్నారు. తెలుగు జాతి కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విజ్ఞాన ఆధారిత నగరంగా తయారు చేశామన్నారు. ఐటీ కంపెనీల స్థాపన కోసం విదేశాల్లోని కార్యాలయాలకు తిరగానని గుర్తు చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం పని చేశానన్నారు. అదేరీతిలో అమ‌రావ‌తిని అభివృద్ధి చేయనున్న‌ట్లు వివ‌రించారు. రాష్ట్రస్థాయిలో ఏ శాసనం చేయాలన్నా రాజధాని అమరావతి నుంచే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వనరులు, సమర్థత ఉన్నా.. చరిత్రలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నామని తెలియజేశారు. తొలుత మద్రాసు నుంచి.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలివెళ్లామని గుర్తు చేశారు. మళ్లీ 58 ఏళ్ల తర్వాత కట్టుబడులు, అప్పులతో తిరిగివచ్చామని తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు మొత్తం 12 జిల్లాల నుంచి 1200 మంది పొలీసులు, 50 మంది డీఎస్పీలు అందుబాటులో ఉండనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News