నవ్యాంద్ర రాజధానికి జలహారం

Update: 2015-12-18 11:34 GMT
అమరావతిని బ్లూ గ్రీన్ విధానంలో అభివృద్ధి చేయడానికి సీఆర్డీఏ సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాలు - ఇతర ప్రదేశాల్లోని చెరువులు - వాగులు - వంకలు - కాల్వలు తదితర జల వనరులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. దీనితోపాటు మొత్తం రాజధానిలోమూడో వంతులో చేపట్టనున్న నగర వన పథకానికి అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

చెరువులు - వాగులు - వంకల విస్తీర్ణం తదితర వివరాలు సేకరిస్తున్నారు. వాటిని నీటితో నింపేందుకు అవసరమైన సప్లై చానల్స్ వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోని చెరువులు - కుంటలు ఆక్రమణలకు గురై రూపు రేఖలను కోల్పోయాయని, వ్యర్థాల చేరికతో కాలుష్య కాసారాలుగా మారాయని గుర్తించింది. చెరువుల్లోని కబ్జాలను తొలగించడంతోపాటు ఎటువంటి వ్యర్థాలు - మురుగునీరు వాటిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాటిలోని మురుగు నీటిని తోడించి వర్షపు నీటితో వాటిని నింపాలని, సరఫరా చానళ్లను పునరుద్ధరించాలని, మొత్తంగా రాజధాని ఏర్పడే నాటికి దాని చుట్టూ ఉన్న చెరువులు - కుంటలను కూడా పర్యాటక ప్రదేశాలకు తీర్చి దిద్దాలని కంకణం కట్టుకున్నారు.

చెరువు గట్లపై పచ్చదనాన్ని పెంచడమే కాకుండా వాకింగ్ ట్రాక్స్ - పెద్దలు సేదతీరేందుకు బల్లలు - పిల్లల ఆటవిడుపు కోసం అవసరమైన పరికరాలు - విద్యుత్తు వెలుగులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల వాటర్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జల వనరులను సంరక్షించి వాటిని సుందరీకరణ చేస్తూనే పచ్చదనానినిక అమరావతి ప్రాంతాన్ని పర్యాయపదంగా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
Tags:    

Similar News