కడుపులో అంత బాధే ఉంటే ఇలా ఎలా బాబు?

Update: 2017-03-03 05:17 GMT
మాటలకు.. చేతలకు మధ్య అంతరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. రాజకీయ నేతల మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టచ్ చేస్తే చాలు.. విభజన  జరిగిన తీరుపై ఆయన విపరీతంగా రియాక్ట్ అవుతుంటారు. విభజన జరిగిన తీరును ఇప్పటికి ఆలోచించినా.. తాను ఇప్పటికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతానని చెప్పే ఆయన మాటలకు.. చేతలకు సంబంధం ఉండదనే చెప్పాలి.

విభజన జరిగిన తీరు ఏ మాత్రం బాగోలేదని చెప్పే చంద్రబాబు.. విభజన విషయంలో తెలుగు వారు బాధ పడినట్లుగానే చంద్రబాబు చెబుతారు కానీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారన్న మాటను సూటిగా చెప్పని వైనం కనిపిస్తుంది. విభజన కారణంగా ఏపీకి నష్టం వాటిల్లితుందని తాను అద్వానీ లాంటి సీనియర్ నేతకు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు విభజన విషయాల్ని ప్రస్తావిస్తూ.. తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం చంద్రబాబుకు అలవాటే.

అంత ఎమోషనల్ అయ్యే బాబు.. చేతల్లో ఎలా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. విభజన కారణంగా చోటు చేసుకున్న నష్టాన్ని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో కవర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని ప్రస్తావించని వైనం ఇటీవల బాబు మాటల్లో కనిపిస్తుంది. విభజన కారణంగా ఏపీకి ఎంతో నష్టం జరిగిందని.. విభజనకు వ్యతిరేకంగా తాను ఎనిమిది రోజులు నిరాహారదీక్ష చేశానని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఏపీ మీద అంత కమిట్ మెంట్ ఉంటే.. గడిచిన మూడేళ్ల (మూడు నెలలకు తక్కువగా) పాలనలో చేసిన దుబారా ఖర్చు మాటేమిటన్న సూటి ప్రశ్నకు బాబు సమాధానం చెబితే బాగుంటుంది. ఓపక్క రాజధాని నిర్మాణం అనే భారీ సవాలు ఎదురుగా ఉన్న వేళ.. తాత్కాలిక భవనాల పేరుతో వేలాది కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్న వైనంపై వస్తున్న విమర్శల్ని బాబు ఎందుకు పట్టించుకోరన్నది పెద్ద ప్రశ్న.

విభజన జరిగిన తీరుకు తన కడుపులో ఎంతో బాధ ఉన్నట్లుగా చెప్పే చంద్రబాబు.. విభజన సమయంలో తాను బాధ పడినంత బాధ తనజీవితంలో ఎప్పుడూ పడలేదని.. హేతుబద్ధత లేకుండా చేస్తున్న విభజనతో ఏపీకి ఇబ్బందులు మిగిలినట్లుగా చెప్పుకొచ్చారు. కష్టాల్ని దిగమింగుకొని కసితో పని చేస్తూ.. ఏపీని తిరుగులేని రాష్ట్రంగా చేస్తానని చెప్పే చంద్రబాబు.. అంతకు ముందే.. ఏపీలో చోటు చేసుకుంటున్న అవినీతిని కాస్తంత సెట్ చేయాలి. ఏపీకి ప్రయోజనం కలిగించే అంశాల మీద రాజీ పడకుండా.. మాటల్లో ప్రదర్శించే కమిట్ మెంట్ ను చేతల్లోనూ చంద్రబాబు ప్రదర్శిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News