బాలకృష్ణ ఉండగా.. హరికృష్ణ ఎందుకు దండగ

Update: 2015-12-08 06:08 GMT
ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కొద్దికాలంగా టీడీపీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారట... అయితే.. అది పార్టీపై ప్రేమ కాదు, పదవిపై ప్రేమ అంటున్నారు టీడీపీ నేతలు కొందరు. చంద్రబాబును ఏదోరకంగా మచ్చిక చేసుకుని మరోసారి రాజ్యసభ సీటు కొట్టేయాలని హరికృష్ణ కోరుకుంటున్నారని.. అందులో భాగంగానే ఆయన ఈమధ్య కాలంలో పార్టీపై తెగ ప్రేమ ప్రదర్శిస్తున్నారని వినిపిస్తుంది. అయితే... టీడీపీ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఆయనకు రాజ్యసభ సీటు దక్కడానికి ఏమాత్రం ఛాన్సు కనిపించడం లేదు. టీడీపీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ పొలిటికల్ కోటా మొత్తం బాలకృష్ణకు వచ్చేయడంతో హరికృష్ణ ఆశ తీరడం కష్టమేనని వినిపిస్తోంది. చంద్రబాబు ఆయన పట్ల సానుకూలంగా లేరని... అందులో హరికృష్ణ స్వయంకృతాపరాధం కూడా ఉందని చెబుతున్నారు.

హరికృష్ణ కు 2008లో టీడీపీ రాజ్యసభకు పంపించింది. అయితే ఆ సమయంలో ఆయన ఏదోరకంగా చంద్రబాబును ఇబ్బందిపెట్టేలా మాట్లాడారే తప్పించి ఆయనకు మద్దతుగా నిలిచిన సందర్భాలు లేవు. దీంతో చంద్రబాబు హరికృష్ణకు బదులుగా బాలకృష్ణను రాజకీయంగా పైకి తెచ్చారు. బాలయ్య కూడా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి సీనియర్ ఎమ్మెల్యేలా పాటుపడుతున్నారు. నిధుల కోసం అవసరమైతే కేంద్రం వద్దకు వెళ్లేందుకైనా సిద్ధపడుతున్నారు. దీంతో బాలయ్య పొలిటికల్ గా స్టాండ్ అయిపోయారనే చెప్పుకోవాలి. ఈ దశలో హరికృష్ణను మళ్లీ రాజకీయ యవనికపైకి తేవడం వల్ల ఇబ్బందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.  వచ్చే ఏడాదిలో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం అందులో ఒకటి వైసీపీకి పోగా మూడు మిగులుతాయి. అందులో ఒకటి మిత్రపక్షం బీజేపీకి పోగా టీడీపీకి మిగిలేవి రెండే. అందులో ఒకటి సిటింగుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఆ ఒక్క సీటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. బీజేపీ నుంచి, టీడీపీ నుంచి కూడా చాలామంది ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అలాంటి దశలో యాక్టివ్ పొలిటీషియన్లను కాదని హరికృష్ణకు ఇస్తే చంద్రబాబుకు కూడా కుటుంబ పాలన అన్న మచ్చ తప్ప వచ్చేదేమీ ఉండదు. దాంతో ఏరకంగా చూసినా హరికృష్ణకు ఛాన్సే లేదు. అయినా సీతయ్య మాత్రం చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తూ నానా పాట్లు పడుతున్నారు.
Tags:    

Similar News