క్రెడిట్ కోసం కాపుల‌కు బాబు న్యాయం చేయ‌ట్లేదట‌

Update: 2017-08-07 06:55 GMT
సాధార‌ణంగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను స‌ఫ‌లం చేయాలంటే....అందులోనూ ఉద్య‌మ బాట ప‌ట్టిన వారిని శాంతింప చేయాలంటే వారి డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డమే ఒక్క‌టే మార్గం క‌దా? కానీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాపుల‌కు న్యాయం చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు క్రెడిట్ అంశం అడ్డుగా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.  కాపులకు ప్రభుత్వం చేసిన మేలుకు సంబంధించిన ఘనత అంతా కాపు మంత్రులకే దక్కేలా వ్యూహరచన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపులను బీసీసిల్లో చేర్చడానికి తీర్మానాన్ని బాబు నాన్చుతున్న‌ట్లు చెప్తున్నారు.

కాపులకు విద్య - ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే రిజర్వేషన్ల కోసం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాపులకు అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా అది ముద్రగడకే దక్కే అవకాశం ఉందన్నది నిర్వివాదాంశం. అలాగే రాష్ట్రంలోని కాపులు ముద్రగడ వెంటే ఉన్నారంటూ అంచ‌నాలున్నాయి. ఈ పరిణామాల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు - ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే రిజర్వేషన్లు - ఇతర ప్రయోజనాలు దక్కినట్టు సంకేతాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప‌లువురు నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాపు మంత్రులైన నిమ్మకాయల చినరాజప్ప - పి నారాయణ - గంటా శ్రీనివాసరావు తదితరులు ముద్రగడపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు మంత్రులు త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నార‌ని చెప్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి - హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అవకాశం దొరికిన ప్రతిసారీ ముద్రగడపై ధ్వజమెత్తుతున్నారు. ముద్రగడ వెంట కాపులెవరూ వెళ్ళవద్దని, కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం ముద్రగడకు ఇష్టం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చిన అనంతరం రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. తాజాగా మరో మంత్రి పి నారాయణ సైతం ముద్రగడ కాపుల రిజర్వేషన్లకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం కాపు మంత్రుల‌పై ప‌లువురు మండిప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో రాష్ట్ర కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ చేపట్టిన కాపు ఉద్యమం కారణంగానే కాపు మంత్రులకు నేడు చంద్రబాబు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఒక విద్యా వ్యవస్థను నడుపుతున్న మంత్రి నారాయణ కనీసం వార్తా పత్రికలైనా చదువుతారా? అని ప్రశ్నించారు. కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుచేసి, రుణాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే అందుకు కారణం ముద్రగడ చేసిన పోరాటమేనని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News