దసరా కానుక లేదు.. దీపావళి పటాసులే!

Update: 2015-09-07 04:45 GMT
తెలుగుదేశం పార్టీలో ఆశావహులకు, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత నుంచి దసరా కానుక లేనట్టే లెక్క. అధినేత దయతలిస్తే.. పండగ సంతోషం అనేది ఉంటేగింటే.. అది దీపావళి పటాసుల రూపంలో ఉండవచ్చునే తప్ప.. దసరా వేడుకల్లో సెలబ్రేట్‌ చేసుకోడానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఈ గొడవంతా దేన్ని గురించి అనుకుంటున్నారా..? పదేళ్ల గ్యాప్‌ తర్వాత.. తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. 15 నెలలు గడచిపోతున్నా.. 'తమకేమీ దక్కలేదే' అని పార్టీ కేడర్‌ ఎదురు చూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల గురించి. ఈ అధ్యాయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన వారికి అప్పటికప్పుడే నామినేటెడ్‌ పదవుల్ని కట్టబెట్టి.. సంతోషపరచడం రివాజు. కానీ తెదేపా గద్దె ఎక్కాక... ఇన్నాళ్లుగా టీటీడీ తప్ప చెప్పుకోదగ్గ నామినేటెడ్‌ పోస్టులేమీ ఇవ్వనేలేదు. పైగా ఇవి దసరాలోగా వచ్చే అవకాశం కూడా లేదని వార్తలు వస్తున్నాయి. పార్టీ కేడర్‌ ను సంతృప్తి పరచడానికి ఈ పదవుల పందేరం చాలా కీలకమైనదే అయినప్పటికీ.. చంద్రబాబునాయుడు ఈ విషయంలో చాలా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ప్రతిసారీ అసెంబ్లీ సమావేశాల తర్వాత.. అనేమాట వినిపించడం, ఆ రోజు వచ్చిన తర్వాత.. నెలల తరబడి వాయిదా వేయడం జరుగుతోంది. చాన్నాళ్లుగా దసరా కానుకగా కేడర్‌ కు పదవులు పంచుతారని అనుకున్నారు. పార్టీలో ఈ విషయం బాగా ప్రచారం జరిగింది. తాజాగా అది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. నామినేటెడ్‌ పోస్టుల్ని ఎవరెవరికి కట్టబెట్టాలనే విషయంలో.. ఇంకా కసరత్తు జరుగుతూనే ఉన్నదిట. అయితే ఈ పదవుల కంటె ముందు పార్టీ కమిటీలను రాష్ట్రస్థాయిలో పూర్తిగా ఏర్పాటుచేయాలని ఉన్నారుట. అది పూర్తయిన తర్వాతే ఇది అని నిబంధన పెట్టుకున్నారుట. దాంతో మరికాస్త వెనక్కు వెళుతుందని.. దీపావళి నాటికి పదవులు దక్కవచ్చునని అనుకుంటున్నారు.

నామినేటెడ్‌ వాటిలో కిందిస్థాయిలో కొన్ని పదవులను పంచేశారు. అంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, డైరక్టర్ల పదవులు.. అంటే పెద్దపెద్ద వాళ్లు ఆశించేవి ఏవీ భర్తీ కాలేదు. పార్టీ ప్రాభవంలోకి వచ్చిన తర్వాత తమ పంచన చేరిన వారికి కాకుండా తొలినుంచి పార్టీని నమ్ముకున్న వారికే పెద్దపీట వేయాలనే డిమాండ్‌ పార్టీలో బాగా వినిపిస్తోంది.
Tags:    

Similar News