సాగు ప్రాజెక్టుల పూర్తిలో బాబు ప్రతిష్ట వెనుక...?

Update: 2017-12-17 17:30 GMT
పట్టిసీమ సకాలంలో పూర్తిచేయటం తోపాటు గత రెండేళ్లుగా విజయవంతంగా కృష్ణా డెల్టాకు నీరందిస్తూ విజయం సాధించిన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమితమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అందుకు కారణం.... పట్టిసీమ - పురుషోత్తమపట్నం - హంద్రీ-నీవా - ముచ్చుమర్రి ప్రాజెక్టుల్లో అత్యధిక పనులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనూ - ఆతర్వాత రోశయ్య - కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలనల్లో పూర్తయినవే.

పట్టిసీమ ప్రాజెక్టు విషయానికి వస్తే పోలవరం కుడికాలువపై పంపులు - మోటార్లు బిగించి నీటిని ఎత్తిపోయటం ద్వారా విజయవంతం చేశారు. పంపులు - మోటార్లు బిగించటం అంత సులువైన పనేమీకాదు. కానీ వాటిని అమర్చి నీటిని కృష్ణా డెల్టాకు పారించటానికి అవసరమైన ప్రధానవనరు పోలవరం కుడికాలువ. ఈ పోలవరం కుడికాలువను రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 ఆగస్టులో ప్రారంభించి యుద్ధప్రాతిపదికన అత్యధిక భాగం పూర్తి చేయించారు. ఈ కాలువ చూస్తే ఒక నదిని తలపిస్తుంది. యమున ఎక్స్‌ ప్రెస్‌ జాతీయ రహదారిని తలపించేంత వెడల్పు ఉంటుంది.

కుడికాలువ మొత్తం పొడవు 177 కి.మీ కాగా - 2009 నాటికే దాదాపు 145 కి.మీ పూర్తిచేశారు. అప్పట్లో ఈ కాలువ నిర్మాణంపై తెలుగుదేశం పెద్ద ఎత్తున రాద్దాంతమే చేసింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ఏవిధంగా విమర్శించిందో తెలుగుదేశం అధినాయకత్వానికి తెలిసిందే. ఇంతపెద్ద కాలువ అవసరమా? రిజర్వాయర్లు లేకుండా కాలువ నిర్మించి నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? గోదావరి - కృష్ణల మధ్య  పోలవరం కుడికాలువలో నీటిని నిల్వ చేయకుండా కృష్ణా డెల్టాకు ఏవిధంగా అందిస్తారు. అదే సమయంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎందుకు? రెండు కాలువలు పక్కపక్కనే తవ్వి రైతుల భూములను సేకరించి పొట్టగొడుతున్నారు. అదే సమయంలో కేవలం కమీషన్ల కోసమే అమాంతరంగా తాడిపూడి కాలువ - పోలవరం కుడికాలువ తవ్వుతున్నారంటూ చంద్రబాబునాయుడు విమర్శించారు. ఇందుకు శాసనసభ రికార్డులు అద్దంపడతాయి. 2005లో రాజమండ్రి - తాడేపల్లిగూడెం లలో జరిగిన ప్రాజెక్టుల బహిరంగ చర్చావేదికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హాజరైన నాటి ఎమ్మెల్యే - రిటైర్డు సీఈ సానా మారుతి కూడా అదే విధమైన విమర్శలు చేశారు.

ఇప్పుడు తెలుగుదేశం వాటినే పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటోంది. పోలవరం కుడికాలువలో భూసేకరణ వివాదాలు పరిష్కరించి రైతులు కోరుకున్న పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన చెల్లించి కోర్టుల్లో వ్యాజ్యాలను ఉపసంహరింపచేయించి కుడికాలువను పూర్తి చేశారు. తద్వారా పట్టిసీమ విజయవంతమైంది. పట్టిసీమ హెడ్‌ వర్క్స్‌ ఏడాదిలో రికార్డు సమయంలో పూర్తి చేయటం గొప్పతనమే అయితే వరదకాలువ లాంటి పోలవరం కుడికాలువను యుద్ధప్రాతిపదికన దాదాపు ఐదేళ్లకాలంలో పూర్తిచేసిన ఘనత రాజశేఖర్‌ రెడ్డిది. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించకుండా తామే పోలవరం కుడికాలువ పూర్తిచేసి పట్టిసీమ ద్వారా నీరు అందించామే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. పోలవరం కుడికాలువ పూర్తికాకుంటే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు అందించటం సాధ్యమవుతుందా?

ఈ విషయంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ వ్యవహరించిన శైలి కూడా చంద్రబాబు కీర్తి కిరీటాలను తెచ్చిపెట్టాయి. పట్టిసీమ ప్రాజెక్టును వైసీపీ వ్యతిరేకించి రాజకీయంగా చేతులు కాల్చుకుంది. నిజానికి ఆ ప్రాజెక్టును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ పోలవరాన్ని పూర్తిచేయకుండా పట్టిసీమపైనే ఆధారపడుతుంటే తప్పుపట్టాలి. కానీ పట్టిసీమ ప్రాజెక్టుకు జగన్‌ అడ్డుపడుతున్నారనే అపవాదు ఆ పార్టీ వ్యవహరించిన తీరు వల్ల కృష్ణా డెల్టా రైతాంగంలోకి రాజకీయ వర్గాల్లోకి తీసుకువెళ్లటంలో టీడీపీ ఆయన అనుకూల వర్గాలు విజయం సాధించాయి. నిజానికి పట్టిసీమ నిర్మాణం నాటి రాజశేఖర్‌ రెడ్డి కృషి వల్లే సాధ్యమవుతోందనే విషయాన్ని జగన్‌ - వైసీపీ చెప్పుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. నాడు ప్రధాన కాలువను అంత పెద్దస్థాయిలో యుద్ధప్రాతిపదికన నిర్మించకుండా ఉండిఉంటే పట్టిసీమ పంపులు ఏర్పాటు చేసినా నీళ్లు కృష్ణాడెల్టాకు వచ్చేవా? అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైసీపీ విఫలమైంది.

అదేవిధంగా హంద్రీ-నీవా - ముచ్చుమర్రి ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్‌ హయాంలో చేపట్టినవే. 2004లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చాక రాజశేఖర్‌ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా హంద్రీ-నీవాను చేపట్టారు. ఆ ప్రాజెక్టు 2012లో పూర్తయి విజయవంతంగా పనిచేస్తోంది. అత్యంత ఎత్తైన - పొడవైన - అత్యధిక పైపులు కలిగిన ప్రాజెక్టుగా ఆసియాలోనే దీనికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండోదశ - అనుబంధ పనులను కొనసాగిస్తూ వాటిని తామే పూర్తి చేస్తున్నట్లు ఆయన ప్రకటించుకుంటున్నారు. ఇంకా ముచ్చుమర్రి ప్రారంభించటానికి ఆయనకు అవకాశం దక్కటానికి కారణం గత ఏడాది పూర్తికావటమే. ఇక పురుషోత్తమపట్నం చేపట్టడానికి పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కూడా దోహదపడింది. ఈ ఎడమకాలువను కూడా అప్పట్లో రాజశేఖర్‌ రెడ్డి 180 కి.మీకి గాను 130 కి.మీ మేర పూర్తి చేశారు. ఈ కాలువ ద్వారా పురుషోత్తమపట్నం 1 - 2 ఎత్తిపోతల పంపింగ్‌ స్టేషన్లు - పైపులైన్లు వేయించి నీటిని ఏలేరుకు అందించే ప్రక్రియ ప్రారంభమైంది.

 --- ఎస్‌ వి
Tags:    

Similar News