చంద్ర‌బాబును నిద్ర‌పోనివ్వ‌ని దెయ్యాలు

Update: 2016-07-24 11:05 GMT
మీరు చ‌దివింది నిజ‌మే! ఈ మాట‌లు సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబే అన్నారు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి - ఎన్నో రాత్రులు శ్ర‌మించి అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేద‌ని, మ‌ధ్య‌లోనే దెయ్యాలు ఆ ఫ‌లాల‌ను మింగేస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. మీడియాతో కొద్దిసేపు మాట్టాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు. సంక్ష‌మ ప‌థ‌కాలు ఎన్నో ఉన్నా.. ఏపీ ప్ర‌జ‌ల‌కు అవి చేరువ కావ‌డం లేద‌నేది వాస్త‌వం. అయితే, ఈ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌లకు చేరువ కాకుండా మ‌ధ్య‌లోనే దెయ్యాలు అడ్డుకుని మింగేస్తున్నాయ‌ని సాక్షాత్తూ సీఎం అన‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే, ప్ర‌జ‌ల‌కు ఆయా సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌కుండా తినేస్తున్న ‘ఆ దెయ్యాలు’ ఏవో మాత్రం బాబు గారు వెల్లడించ‌లేదు. దీంతో ఆ దెయ్యాలు ఎవ‌రో - ఎక్క‌డ ఉన్నాయో - ఎలా పుట్టాయో తెలిసి కూడా సీఎం ఎందుకు నోరు విప్ప‌డం లేద‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంద‌రు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అంద‌నీయ‌డం లేద‌ని చెప్పిన చంద్ర‌బాబు వారి పేర్ల‌ను చెప్ప‌కుండానే ప‌రోక్షంగా వారికి దెయ్యాలు అని పేరు పెట్టి విమ‌ర్శించ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అంటే.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు ఎవ‌రు గండికొడుతున్నారో సీఎంకు తెలిసిపోయింద‌న్న‌ట్టు ఆయ‌న మాట‌ల్లో అర్థం స్ప‌ష్ట‌మైంది.

  ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దూకుడుగానే ముందుకు వెళుతోంది. అభివృద్ధి ఎలా జ‌రుగుతుందో...అవినీతి కూడా అంతే స్థాయిలో విజృంభిస్తోంద‌న్న వ్యాఖ్య‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే ప్ర‌తిప‌క్షం వైకాపా త‌న ఉనికిని కాపాడుకునే ప‌రిస్థితిలో ప‌డిపోయింది. ఎప్పుడు.. ఎవ‌రు పార్టీకి ఝ‌ల‌క్ ఇస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక ప్ర‌భుత్వం ఎంత మంచి సంక్షేమ పథ‌కాలు పెట్టామ‌న్న‌ది కాదు అవి పేద‌ ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయా లేదా అన్న‌దే ముఖ్యమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  సంక్షేమ ప‌థ‌కాల‌ను తినేసే దెయ్యాల దూకుడుకు బాబు బ్రేకులు వేస్తేనే ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టే ప‌థ‌కాలు అర్హుల‌కు అందుతాయి. మ‌రి బాబు ఈ దెయ్యాల ఏరివేత‌పై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News