జ‌మిలి ఎన్నిక‌ల‌పై బాబు మార్క్ వాద‌న!!

Update: 2018-07-08 12:47 GMT
క‌ర్ర విర‌క్కూడ‌దు.. పాము చావ‌కూడ‌దంటే  ఎలా?  అన్నిసార్లు అలాంటివి సాధ్యం కాదు.కొన్ని సంద‌ర్భాల్లో ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌టం కూడా ఖాయం. ఏపీ రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలోనూ ఎటూ తేల్చుకోకుండా రెండు క‌ళ్ల సిద్ధాంత‌మ‌ని.. కొబ్బ‌రి చిప్ప‌ల సిద్ధాంతాన్ని చెప్పి న‌వ్వుల పాలైన చంద్ర‌బాబుకు ఇప్ప‌టికి బుద్ధి రాలేదా? అన్న సందేహం క‌లిగేలా మ‌రోసారి వ్య‌వ‌హ‌రించారు.

పార్టీని ర‌క్షించుకోవాలి క‌దా? అంటూ విభ‌జ‌న‌కు త‌మ పార్టీ ఓకే అంటుంద‌ని చెప్పిన బాబుకు చివ‌ర‌కు తెలంగాణ‌లో పార్టీ ఏమైంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. నాడు తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న‌కు ఓకే చెప్పిన బాబు.. ఏపీ విష‌యంలో మాత్రం న్యాయం చేయాల‌న్న మాట చెప్పారే కానీ.. మ‌రే డిమాండ్‌ను తెర మీద‌కు తీసుకురాలేదు. వాస్త‌వానికి బాబుకు ఈ రోజు ప‌వ‌ర్ ఉందంటే అది ఆంధ్రోళ్ల వ‌ల్ల‌నే.

ఏపీ విభ‌జ‌న‌కు మూల కార‌కుడైన బాబునున సీఎం చేసిన ఘ‌న‌త ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిదే. త‌మ అభిమ‌తానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత కూడా అధికారాన్ని చేతికి అప్ప‌గించిన ఏపీ ప్ర‌జ‌ల‌కు గ‌డిచిన నాలుగేళ్ల‌లో బాబు చేసిందేమిట‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్న చంద్ర‌బాబు.. తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల్లోనూ త‌న త‌డ‌బాటును.. క‌చ్ఛితంగా నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేని అశ‌క్త‌త‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ఒక‌డుగు ముందుకు.. రెండు అడుగులు వెన‌క్కి అన్న చందంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న తీరు చూస్తే.. ఒళ్లు మండ‌క మాన‌దు. జ‌మిలి ఎన్నిక‌లు కావాలా? వ‌ద్దా?  అన్న సింఫుల్ ప్ర‌శ్న‌కు త‌ల‌లు బ‌ద్ధ‌లు కొట్టుకునేలా చేసే ల‌క్ష‌ణం బాబులో ఎంత ఉంద‌న్న‌ది తాజాగా ఆయ‌న వాద‌న వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

జ‌మిలి ఎన్నిక‌ల‌పై టీడీపీ వైఖ‌రిని లా క‌మిష‌న్ కు వినిపించే బాధ్య‌త‌ను పార్టీ ఎంపీలు తోట న‌ర‌సింహం.. క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌ కు అప్ప‌జెప్పారు. క‌మిష‌న్ కు వారు చెప్పిన వాద‌న‌ను సింఫుల్ గా చెప్పాలంటే.. 2019లో జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఓకే. అలా అని.. జ‌మిలి కోస‌మ‌ని 2019లో నిర్వ‌హించాల్సిన ఎన్నిక‌ల్ని ముందు నిర్వ‌హిస్తానంటే మాత్రం నో అంటే నో అనేశారు.

లోక్ స‌భ‌ను ముంద‌స్తు కోసం ర‌ద్దు చేసి ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. తాము మాత్రం రాష్ట్ర అసెంబ్లీని ర‌ద్దు చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేసిన టీడీపీ ఎంపీలు.. త‌మ అసెంబ్లీని ఐదేళ్ల పాటు కొన‌సాగిస్తామ‌న్నారు. క్లాజులు.. స‌బ్‌ క్లాజ్ ల‌తో త‌మ వాద‌న‌ను లా క‌మిష‌న్ ముందు వినిపించిన టీడీపీ ఎంపీలు.. మీడియా ముందు మాత్రం జ‌మిలి ఎన్నిక‌ల‌కు తమ పార్టీ వ్య‌తిరేక‌మ‌ని చెప్పామ‌న్నారు. జ‌మిలితో ఎన్నిక‌ల ఖ‌ర్చును త‌గ్గించుకోవ‌చ్చ‌ని.. ప‌రిపాల‌నా సౌల‌భ్యాన్ని పెంచుకోవ‌చ్చ‌ని చెప్పార‌ని.. అయితే.. జ‌మిలి ఎన్నిక‌ల ద్వారా ఆ ల‌క్ష్యాలు నెర‌వేర‌వ‌న్నారు.

లోక్ స‌భ‌కు ముంద‌స్తు రావాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే తాము సిద్ధ‌మే కానీ.. రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం ముంద‌స్తు అంటే మాత్రం తాము నో అంటామ‌న్నారు. ఒక‌సారి ఎన్నిక‌లు నిర్వ‌హించిన త‌ర్వాత రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌డిపోతే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రిపి మ‌ధ్యంత‌రం ఎన్నిక‌లు కేవ‌లం ప‌రిమిత కాలానికే చేప‌ట్టాల‌న్న‌ది రాజ్యాంగ విరుద్ధమ‌న్నారు. ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలు మ‌రింత ఇబ్బందికి గురి అవుతాయ‌ని చెప్పారు. జ‌మిలితో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌ప‌ర్చ‌టం కూడా కేంద్రం ఉద్దేశంగా తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రాంతీయ‌పార్టీల‌కు ఇబ్బంది క‌ల‌గ‌టం ఖాయ‌మ‌న్నారు. ఓవైపు జ‌మిలికి పాక్షికంగా ఓకే చెబుతూ.. మ‌రోవైపు న‌ష్టాల్ని ఏక‌రువు పెట్టే క‌న్నా.. మ‌న‌సులో ఉన్న మాట‌ను సూటిగా.. స్ప‌ష్టంగా చెప్పేస్తే స‌రిపోతుంది క‌దా?


Tags:    

Similar News