దీపావ‌ళి సంబరం చంద్ర‌బాబుకు మాత్ర‌మేనా?

Update: 2017-10-13 05:41 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఏం ఆలోచిస్తారో అర్థమే కాదు. ఆయ‌న నిర్ణ‌యాలు ఆయ‌న ప‌రిధికే ప‌రిమితం చేసుకునేలా ఆయ‌న ఆలోచిస్తార‌న్న అభిప్రాయం క‌లుగ‌క మాన‌దు. బాబు అడుగు తీసి అడుగు వేయాలంటే భారీ సిబ్బంది ప‌ని చేయాల్సిందే. అదే చంద్ర‌బాబు రాజ‌ధాని న‌గ‌రం నుంచి వేరే జిల్లాకు వెళుతున్నారంటే జ‌రిగే హ‌డావుడి అంతా ఇంతా కాదు.

వంద‌లాదిగా అధికార గ‌ణం ఆయ‌న‌కు సేవ‌లు అందించేందుకు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇక‌.. వంద‌ల మందితో ఏదైనా కార్య‌క్ర‌మం చేప‌డితే ఈ హ‌డావుడి మ‌రింత భారీగా ఉంటుంది. దీంతో.. త‌న కోసం ప‌ని చేసే కుటుంబాల‌న్నీ కూడా పండ‌గ చేసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అందుకే.. పండుగల వేళ ముఖ్య‌నేత‌లు.. కీల‌క నేత‌లు బ‌య‌ట ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోరు. ఎవ‌రికి వారు వారి కుటుంబాల‌కే ప‌రిమితం అవుతారు.

కానీ.. చంద్ర‌బాబు తీరు వేరే. ఏదైనా పండుగ వ‌చ్చిందంటే.. ఏదో పేరిట ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్య‌మంత్రివ‌ర్యులే స్వ‌యంగా హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో అధికారులంతా ఉరుకులు ప‌రుగులు తీస్తూ స‌ద‌రు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంతా చేస్తే.. ఆయ‌న అలా వ‌చ్చి.. ఇలా వెళ్లిపోతారు. లేదంటే కాసేపు గ‌డుపుతారు. ఇందుకోసం జ‌ర‌గాల్సిన క‌స‌ర‌త్తు భారీగా ఉంటుంది.

పండుగ వేళ.. అందునా దీపావ‌ళి లాంటి ప‌ర్వ‌దినాన‌ సీఎం స్వ‌యంగా ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి..దానికి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తే.. అందుకయ్యే హ‌డావుడి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. దీపావ‌ళిని ఈసారి వినూత్నంగా జ‌రుపుకోవాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఆయ‌న అభిలాష‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు వంద‌లాది సిబ్బంది.. అధికారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఇన్ వాల్వ్ కావాల్సి ఉంటుంది. వీరంద‌రి కుటుంబాల్లో ఇంటి పెద్ద లేకుండా దీపావ‌ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత‌కీ.. చంద్ర‌బాబు చేసుకోవాల‌నుకుంటున్న ఢిప‌రెంట్ దీపావ‌ళి కాన్సెప్ట్ ఏమిటంటే.. విశాఖ‌ప‌ట్నంలో 2 వేల మంది దివ్యాంగులైన బాల‌ల‌తో పాటు.. అనాథ చిన్నారుల‌తో ఆనంద దీపావ‌ళి చేసుకోవాల‌నుకుంటున్నారు.

పేరులో ఆనందం ఉన్నా.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోసం ప‌ని చేయాల్సిన వారు.. ఆయ‌న కోరికైన ఆనంద దీపావ‌ళిని నిర్వ‌హించే వారికి మాత్రం అన్ హ్యాపీ దీపావ‌ళిగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఏడాది ఒక్క‌సారి వ‌చ్చే దీపావ‌ళి పండ‌గ కోసం పెద్ద‌వాళ్ల కంటే పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది అధికారిక కార్య‌క్ర‌మానికి త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రో ఒక‌రు హాజ‌రు కావాల్సి ఉండ‌టం.. ఆయా కుటుంబాల్లో దీపావ‌ళి సంద‌డి మిస్ కావ‌టం ఖాయం.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఆర్కే బీస్ లో బ‌హిరంగంగా చేసుకోవాల‌నుకోవ‌టం మ‌రో త‌ప్పుగా అభివ‌ర్ణిస్తున్నారు. ఆరుబ‌య‌ట‌.. దీపావ‌ళి రోజున నిర్వ‌హించ‌టం బాగానే ఉన్నా.. దివ్యాంగుల్ని.. అనాథ బాల‌ల్ని తీసుకురావ‌టం.. తీసుకెళ్ల‌టం  ఇబ్బందితో కూడుకున్న‌దే. బాబుదేం పోయింది.. సీఎం హోదాలో భారీ బందోబ‌స్తు మ‌ధ్య వ‌చ్చి వెళ‌తారు. ఆయ‌న స‌ర‌దా తీర్చ‌టానికి వ‌చ్చే వారి విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌న్న‌ది సందేహ‌మే.

ఆనంద దీపావ‌ళి పోగ్రాంను దీపావ‌ళి రోజున‌..  సాయంత్రం 6.30 నుంచి 7 గంట‌ల మ‌ధ్య నిర్వ‌హించాల‌ని డిసైడ్ చేశారు. బాబుగారి అర‌గంట ఆనందం కోసం వంద‌లాది మంది అవ‌స్థ‌లు ప‌డాల్సిన అవ‌స‌రం ఉందా? చూస్తుంటే.. బాబు దీపావ‌ళి స‌ర‌దా.. వంద‌లాది మందికి పండుగ ఎంజాయ్ ను మిస్ చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News