ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది

Update: 2016-04-24 09:35 GMT
`త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కాబోతోంది. ఇంకొన్ని రోజుల్లో కొత్త మంత్రుల‌ను చూడ‌బోతున్నాం. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ ను కూడా మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫ‌లానా శాఖ ఇవ్వ‌బోతున్నార‌న్న విష‌యం అయితే ఇంకా క్లారిటీ లేదు. అలాగే మంత్రి ప‌ద‌వి కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారు.` ఇవీ గ‌త కొద్ది రోజుల నుంచీ.. ఏపీలో వినిపిస్తున్న హాట్‌హాట్ వార్త‌లు. ఇంక కొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిపోతుంద‌న్నంత వ‌ర‌కూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కానీ ఇప్పుడు క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు బ్రేక్ పడింది. మ‌రి ఇంత స‌డ‌న్‌ గా క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు బాబు బ్రేక్ వేయ‌డానికి గ‌ల కార‌ణాలేంటి?  సీఎం చంద్ర‌బాబు కొత్త ప్లాన్ ఏంటో చూద్దాం.

ఉగాది నాటికో.. ఆ తర్వాతో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఏపీలోని రాజ‌కీయ నాయ‌కులు భావించారు.  అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేబినెట్ విస్తరణ ఇప్పుడే జరిగేటట్లు కనిపించడం లేదనేది టీడీపీ సీనియర్‌ నేతల అభిప్రాయం. ఈ ప్రక్రియకు ఇంకో రెండు మూడు నెలలు ఆగాల్సిందే చెబుతున్నారు. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు…ఇందుకు రెండు నెల‌లు స‌మ‌యం కూడా ప‌డుతుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం లేదని పార్టీలోని సీనియర్లు స్పష్టంగా చెబుతున్నారు.

మంత్రులకు తమను తాము నిరూపించుకునేందుకు కనీసం రెండేళ్లు కూడా సమయం ఇవ్వకుండా మళ్లీ శాఖ‌లు బ‌దిలీ చేయడం కరెక్టు కాదనే భావనతో చంద్రబాబు ఉన్నార‌ని వివ‌రిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు సంబంధించిన చర్చకు తాత్కాలికంగా తెరపడిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ముందుగా రాజ్యసభ ఎన్నికలు.. ఎవరెవరికి పదవులు కట్టబెట్టాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసి.. తర్వాత‌ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించాల‌ని బాబు యోచిస్తున్నార‌ట‌. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే అసంతృప్తులు ఎక్కువ‌వుతాయ‌ని బాబు భావిస్తున్నారు. దీనిని బ‌ట్టి కేబినెట్ విస్త‌ర‌ణకు ఇంకో రెండునెల‌లు ప‌ట్టే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.
Tags:    

Similar News