బాబు...బాహుబ‌లి...ఎన్నారైలు

Update: 2017-05-08 07:27 GMT
అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారిని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. శాన్‌ హూజ్‌ లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ క‌ష్టాల గురించి, త‌న ప‌రిపాల‌న గురించి ఏక‌రువు పెడ్తూనే...ఎన్నారైల్లో ఉత్సాహం నింపే వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చామని చంద్ర‌బాబు మ‌రోమారు గుర్తు చేశారు! రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని, అయినా వెనుకడుగు వేయలేదని తెలిపారు. సంక్షోభాన్ని అవకాశంగా మరల్చుకుని ముందుకు సాగుతున్నానని చంద్రబాబునాయుడు అన్నారు. తన పిల్లలకు మంచి చదువులు అందజేయాలనుకున్నానని చెప్పిన ఆయన ఎక్కడ ఉంటే సమాజానికి ఉపయోగపడేలా మంచి చదువు శిక్షణ లభిస్తాయన్న ఉద్దేశంతో తన కుమారుడు లోకేష్ - కోడలు బ్రహ్మణిలను శాన్ హౌజ్‌ లో చదివించామని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారు ఉన్నారని చంద్ర‌బాబు వివ‌రించారు. అయితే శాన్‌ హౌజ్‌ లో ఇంత మంది తెలుగువారిని చూస్తుంటే తాను అమెరికాలో ఉన్నానా, అమరావతిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోందని ఎన్నారైల‌కు ఊపు ఇచ్చే ప్ర‌శంస ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబునాయుడు వారిని మ‌రింతగా పొగిడేస్తూ... తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా తయారై.. ప్రపంచ పటంలో తెలుగువారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ‘నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారు. తెలుగుజాతికి కష్టపడే తత్వం ఉంది. మనం ఎక్కడైనా పనిచేయగలం. తెలుగు బిడ్డ రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం ద్వారా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటారు. బాహుబలి సినిమా చూడకపోతే ఏదో తప్పు చేశామన్న భావన అందరిలోనూ కలిగింది. అదీ తెలుగువాడి సత్తా. అలా అంద‌రూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోవాలి`` అంటూ బాహుబ‌లి గురించి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నారైల‌కు మాతృదేశం ప‌ట్ల ఉండాల్సిన మ‌మ‌కారాన్ని చంద్ర‌బాబు విశ‌దీక‌రించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు పుట్టిన ఊరును మరిచిపోవద్దని బాబు సూచించారు. ``రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలి. కొత్తగా ఆలోచించి ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయాలి. ఏదైనా సాధించగలం అన్న ఉక్కు సంకల్పం మనకుండాలి. అమెరికాలో ఉండే ప్రజలతో మమేకమైతే మనకు తిరుగుండదు’ అని చంద్రబాబు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News