దేవేంద్రుడి రాజధానిలో అహంకారం చూపించొచ్చా?

Update: 2017-02-16 05:20 GMT
మాటలదేముంది చాలానే చెప్పొచ్చు. చేతిలో అధికారం ఉంటే ఏమైనా మాట్లాడేయొచ్చన్నట్లుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తుంటే. ఏపీ రాజధాని అమరావతి గురించి ఆయన తాజాగా చెప్పిన మాట వింటే కాసింత కామెడీగా ఉంటుందని చెప్పాలి. అమరావతి దేవేంద్రుడి రాజధాని అని.. ఈ ప్రాంతంలో ఎవరూ గొడవలు.. నేరాలు చేయటానికి వీల్లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. నేరాల సంగతిని ఎవరూకాదనలేరు. మరి.. గొడవలంటే చంద్రబాబు దృష్టిలో ఏమిటి? న్యాయం కోసం పోరాటం చేయటం కూడా గొడవే అవుతుందా? అన్నది తేల్చాలి.

చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం చేజారిన తర్వాత మరోలా వ్యవహరించటం చంద్రబాబుకు అలవాటే. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఆందోళనలు.. నిరసనలు చేపట్టారో తెలిసిందే. తాజాగా తాను పవర్ లో ఉన్నప్పుడు.. న్యాయబద్ధమైన అంశాల విషయంలో నిరసన చేస్తానంటే కూడా నో చెప్పేయటమే కాదు.. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టే నిరసనలకు అనుమతులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేని వైనం కనిపిస్తుంది.

దేవేంద్రుడి రాజధానిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు కూడా తెలియచేయకూడదా? అన్న సూటి ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబితే బాగుంటుంది. దేవేంద్రుడి రాజధానిలో మహిళల్ని ఘోరంగా అవమానించొచ్చా? అతిధిగా పిలిచి.. అరదండాలు వేసినట్లుగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని.. అక్కడెక్కడో హైదరాబాద్ కు తీసుకెళ్లి వదిలిపెట్టొచ్చా? దేవేంద్రుడి రాజధానిలో అలాంటి పనులు చేయొచ్చా? అన్న ప్రశ్నకు బాబు ఏమని బదులిస్తారు.

అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బాబు సర్కారు.. దేవేంద్రుడి రాజధానిలో అహంకారం.. అధికార మదంతో వ్యవహరించొచ్చా? అన్నది సందేహాలు. ఒకవేళ అవే లేకుంటే.. ఎన్నికల వేళ కోట్లాది మంది ప్రజల సాక్షిగా ప్రత్యేక హోదా మీద హామీలకు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు హోదాతో ప్రయోజనం సున్నా అని ఎలా తేల్చేస్తారు? ఒకవేళ.. ప్రయోజనం లేకుంటే.. ఆ విషయాన్ని ముందు నుంచి ఎందుకు చెప్పలేదు? అన్నది ప్రశ్న. ఇలాంటి ధర్మబద్ధమైన ప్రశ్నలకు దేవేంద్రుడి రాజధానిలో సమాధానాలు ఎందుకు దొరకటం లేదన్నది సందేహానికి సమాధానం చెప్పేదెవరు చంద్రబాబు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News