ఈ ఖ‌ర్చులేంది చంద్ర‌బాబు..?

Update: 2015-05-29 11:39 GMT
విభ‌జ‌న‌తో అప్పుల పాలైన రాష్ట్రంలో.. నిధుల కోసం క‌ట‌క‌ట‌లాడే ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి రూపాయిని ప‌ది రూపాయిల మాదిరి ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి. మ‌రి.. రాష్ట్రాన్ని దేశంలో బ్ర‌హ్మండ‌మైన రాష్ట్రంగా మారుస్తాన‌ని చెప్పే చంద్ర‌బాబు.. ఖ‌ర్చుల విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌టం లేదు. ఎడాపెడా చేసేస్తున్న ఖ‌ర్చు లెక్క వింట క‌ళ్ల ముందు చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయం.

హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్ ఏర్పాటుకు భారీగా ఖ‌ర్చు చేసిన చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంతింటి నుంచి అద్దె ఇంటికి మార‌టం తెలిసిందే. దీంతో.. ఆ ఇంటికి అవ‌స‌ర‌మైన వాటిని ఏర్పాటు చేయ‌టం కోసం పెడుతున్న ఖ‌ర్చు మోత మోగుతోంది. ఇప్ప‌టికే రూ.81.10ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన ఆ ఇంటికి.. తాజాగా మ‌రో రూ.55ల‌క్ష‌లు విడుద‌ల చేయ‌టం గ‌మ‌నార్హం.

సొంతింటిని కూల్చేసి తిరిగి క‌ట్టిస్తున్న నేప‌థ్యంలో.. జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబ‌రు 24లోని అద్దెంట్లోకి మారారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు ఇళ్లు మార‌టంతో.. కొత్తింట్లోనూ సీఎంగారికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసేందుకు రూ.81.10ల‌క్ష‌లు ఖ‌జానా నుంచి విడుద‌ల చేశారు. ఆ నిధులు అయిపోయి.. మ‌రిన్ని హంగులు స‌మ‌కూర్చాల్సి రావ‌టంతో అద‌నంగా మ‌రో రూ.55.85 ల‌క్ష‌లు విడుద‌ల చేశారు. ఈ మేర‌కు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.


ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కోసం ఖ‌ర్చుతో పాటు.. హైద‌రాబాద్‌..విజ‌య‌వాడ రెండు చోట్ల ఆయ‌న ప‌ని చేయాల్సి రావ‌టంతో.. క్వాన్వాయ్ మొద‌లు.. బెజ‌వాడ‌లోనూ మ‌రో క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాని కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఇలా.. ఖ‌ర్చు మీద ఖ‌ర్చుతో ఏపీ ఖ‌జ‌నా మీద బాబు భారం భారీగా పెరుగుతోంది.

అప్పులు పాలైన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆచితూచి ఖ‌ర్చు చేయాల్సిన చంద్ర‌బాబు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్ని త్యాగాల‌కుసిద్ధం కావాల‌ని నీతులు చెప్పే చంద్ర‌బాబు.. త‌నింటి వ‌ర‌కూ సొంత ఖ‌ర్చుతో ఏర్పాట్లు చేసుకుంటే ఎంత ఆద‌ర్శంగా ఉంటుంది? ఒక‌వేళ‌.. ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో ఏర్పాట్లు చేయించుకున్నా.. కాస్తంత జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేస్తే విమ‌ర్శ‌లు త‌ప్పుతాయి క‌దా. అప్పుల్లో ఉన్న ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఇంత ఖ‌ర్చు పెట్ట‌టం స‌మంజ‌స‌మేనా?
Tags:    

Similar News