ఈ అడుక్కోవ‌టం ఎప్ప‌టికి ఆపుతారు బాబు?

Update: 2017-07-05 06:00 GMT
స‌మ‌స్య‌లు ప్ర‌తి ఒక్క‌రికి మామూలే. సంబంధం లేకున్నా మీద ప‌డేవి కొన్ని అయితే.. అస‌మ‌ర్థ‌త‌తో నెత్తిన వేసుకునే స‌మ‌స్య‌లు మ‌రికొన్ని. ఏపీ రాష్ట్రానికి ఉన్న స‌మ‌స్య‌ల్ని చూస్తే.. అన్ని అస‌మ‌ర్థ‌త‌తో తెచ్చి పెట్టుకున్న‌వే త‌ప్పించి మ‌రింకేమీ కాద‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి రావాల్సిన‌వ‌న్నీ డిమాండ్ చేసి మ‌రీ తెచ్చుకోవాల్సింది పోయి.. ఆత్మాభిమానాన్ని మ‌రిచి.. మోడీ అధికారాన్ని చూసి జ‌డిచి.. ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులు ఒత్త‌ట‌మే క‌నిపిస్తుంది.

అంత పెద్ద ఇందిర‌మ్మ‌ను సైతం లైట్ తీసుకొని తెలుగోడి ఆత్మ‌గౌర‌వం విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని గ‌ర్జించిన ఎన్టీఆర్ పార్టీలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితి చూస్తే.. అయ్యో అనిపించాల్సిందే. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన వాటిని డిమాండ్ చేసి మ‌రీ తెచ్చుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అడుక్కునే ధోర‌ణికి చంద్ర‌బాబు తెర తీశార‌న్న విమ‌ర్శ ఎప్ప‌టి నుంచో ఉంది.

రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికి రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టాల్సిన అవ‌స‌రం లేకున్నా.. ఆ ప‌ని చేయ‌టం ఎందుకో అర్థం కాదు. ఇవాల్టి రోజున ఎలాంటి వారికి సంఘంలో మ‌ర్యాద‌.. గౌర‌వం ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంట‌ప్పుడు విభ‌జ‌న కార‌ణంగా చాలా స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుపోయామ‌ని.. త‌మ‌ను ఆదుకోవాల‌ని క‌నిపించిన వారంద‌రిని అడుక్కుంటే స‌మ‌స్య‌లు తీరుతాయా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

నిన్న‌టి సంగ‌తే చూసుకుంటే.. త‌న గెలుపు కోసం త‌న‌కు స‌హ‌క‌రించాల్సిందిగా కోరుతూ.. ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ ఏపీకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికిన చంద్ర‌బాబు టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో  స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. త‌న‌కు ఓటు వేసి.. సాయం చేయాల‌ని అడ‌గ‌టానికి వ‌చ్చిన కోవింద్‌ ను తిరిగి త‌మ‌కు సాయం చేయాలంటూ చంద్ర‌బాబు కోర‌టం ఎబ్బెట్టుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

రాష్ట్రప‌తి స్థానంలో కూర్చున్న వ్య‌క్తికి ఉండే అధికారాలు స్ప‌ష్టంగా తెలిసిందే. ఒక రాష్ట్రానికి మేలు క‌లిగించేలా ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌ధానిని ప్ర‌భావితం చేయ‌లేరు కూడా. త‌న‌కే ప‌ద‌విని ఇప్పించిన ప్ర‌ధానిని రాష్ట్రప‌తి సీట్లో కూర్చున్న నేత స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చే అవ‌కాశం ఉందా? అంటే లేద‌ని చెప్పాలి. మ‌రి..ఇలాంట‌ప్పుడు ఎందుకు ఏపీకి సాయం చేయాల‌ని చంద్ర‌బాబు అడుగుతారో ఆయ‌న‌కే అర్థం కావాలి. క‌నిపించిన ప్ర‌తిఒక్క‌రిని సాయం చేయాల‌ని దేబిరించ‌టం.. కోట్లాది మంది ఆంధ్రోళ్ల ఆత్మాభిమానాన్ని బ‌జార్లో పెట్టిన‌ట్లే అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సాయం కోరి వ‌చ్చిన వ్య‌క్తిని.. మ‌ర్యాద‌లు చేసి ఓకే అని చెప్పి పంపాల్సింది పోయి.. త‌మ‌ది మూడున్న‌రేళ్ల ప్రాయం ఉన్న రాష్ట్రమ‌ని.. మీ ఆశీస్సులు కావాల‌ని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని కోర‌టంలో ఏమైనా అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. సాయం కోరి వ‌చ్చిన వారిని తిరిగి సాయం చేయ‌మ‌ని కోర‌టం చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో?


Tags:    

Similar News