చంద్ర‌న్న మాట‌ను త‌మ్ముళ్లు వింటారా?

Update: 2016-05-27 11:32 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాట‌ను ఆ పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు వింటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదేం పిచ్చి ప్ర‌శ్న‌.. బాబు మాట‌ను విన‌కుండా టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ మాట వింటారా? అని ఎట‌కారంగా ఎదురు ప్ర‌శ్న వేయొచ్చు. కానీ.. విష‌యం మొత్తం తెలిస్తే.. అంత తొంద‌ర‌ప‌డి స‌మాధానం చెప్పే అవ‌కాశం ఉండ‌దు.

మూడు రోజుల పాటు తిరుప‌తిలో జ‌రిగే తెలుగుదేశం పార్టీ మ‌హానాడుకు హాజ‌ర‌య్యేందుకు రెండు తెలుగురాష్ట్రాల‌కు చెందిన టీడీపీ నేత‌లు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున తిరుప‌తికి చేరుకున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. ఇలా వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన తెలుగు త‌మ్ముళ్లు త‌మ‌కున్న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించి తిరుప‌తిలోని టీటీడీ గెస్ట్ హౌస్ లు మొద‌లుకొని ప్రైవేటు హోట‌ళ్ల‌లోని గ‌దుల్ని సైతం బ్లాక్ చేసేశారు. దీంతో తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే స‌గ‌టు భ‌క్తుల‌కు రూమ్ లు దొర‌క‌ని ప‌రిస్థితి. దీంతో.. వారు రూమ్ ల కోసం తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

ఈ విష‌యంలో మీడియాలో రావ‌టం.. చంద్ర‌బాబు దృష్టికి వెళ్ల‌టంతో ఆయ‌న స్పందించారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ మ‌హానాడులో కాలం గ‌డిపే త‌మ్ముళ్ల‌కు రూమ్‌ ల అవ‌స‌రం పెద్ద‌గా ఉండ‌ద‌ని.. అందుకే.. తాము గంప‌గుత్త‌గా తీసుకున్న గ‌దుల్ని వెన‌క్కి ఇచ్చేయాలంటూ ఆయ‌న కోరుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారంతా తీసుకున్న గ‌దుల్ని వెన‌క్కి ఇచ్చేసి.. ఒక‌ట్రెండు గ‌దుల్లో స‌ర్దుకోవాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్లు చంద్ర‌న్న మాట‌ను ఎంత‌వ‌ర‌కూ పాటిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బాబు చెప్పిన‌ట్లే నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు తాము దిగిన వ‌స‌తి గృహాల గదుల్ని ఖాళీ చేసి తిరుప‌తికి వ‌చ్చిన యాత్రికుల‌కు ఇస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధాన మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News