చింతమనేని.. వనజాక్షి ఇద్దరూ తప్పు చేశారు

Update: 2015-12-21 09:17 GMT
తప్పు తనవాళ్లు చేసినా దాన్ని ఒప్పుకునేందుకు చాలానే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యాన్నే తాజాగా ప్రదర్శించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ శాసనమండలిలో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారంలో నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. పార్టీలకు అతీతంగా అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వ్యవహారంలో మీడియాకు కూడా నోటీసులు ఇస్తామని.. వారి దగ్గర ఆధారాలు కూడా ఇవ్వాలని వెల్లడించారు. ఒకవేళ ఆధారాలు చూపించలేకుంటే వారి మీద చర్యలు తప్పవన్నారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశామని.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఏపీలో సంచలనం సృష్టించిన ఇసుక వ్యవహారంలో తహసిల్దార్ వనజాక్షి మీద తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభావకర్ దౌర్జన్యం చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు.. విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం మీద మాట్లాడిన చంద్రబాబు.. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారిణి వనజాక్షితో పాటు.. తమ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇద్దరిదీ తప్పు ఉందని వ్యాఖ్యానించారు. అధికారులు హద్దుల్లో ఉండాలన్న చంద్రబాబు ఎమ్మెల్యేలు కూడా వారి వారి హద్దుల్ని దాటరాదంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. పార్టీ నేతలు లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవన్న సందేశాన్ని ఇచ్చినట్లేనని చెప్పక తప్పదు.

ఈ మధ్యన తప్పు చేస్తున్న తమ పార్టీ నేతల విషయంలో చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తమ పార్టీ నేతల మీద ఆరోపణలు ఏమైనా వస్తే.. వారి విషయంలో బాబు కఠినంగా వ్యవహరించే వారన్న పేరుంది. కానీ.. సుదీర్ఘ కాలం పాటు విపక్షంలో ఉండి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత.. చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే.. మండలి సాక్షిగా తమ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసిన విషయాన్ని ఒప్పుకోవటం గమనార్హం. తాజాగా బాబు వ్యాఖ్యలు చూస్తే.. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టనన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు కనిపిస్తుంది.
Tags:    

Similar News