బాబు.. బ్యాలెన్స్ మిస్ అవుతున్నారా?

Update: 2016-03-04 11:30 GMT
ఒత్తిడి మా చెడ్డది. ఉత్తినే ఉంచదు. నోటి వెంట ఏదేదో వచ్చేలా చేస్తుంది. ఇలాంటప్పుడే కాస్త సంయమనంగా వ్యవహరించాలి. మామూలుగా ఉన్నప్పుడు మొనగాడి మాటలు చెప్పేటోళ్లు.. కూసింత ఒత్తిడికి కుదేలు కావటం కామన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అలానే బుక్ అవ్వబోతున్నారా? అమరావతిలో భూ దురాక్రమణ అంటూ జగన్ పత్రిక చేస్తున్న ఆరోపణలతో బ్యాలెన్స్ కోల్పోతున్నారా? అంటే.. అవుననిపించేలా ఉన్నాయి ఆయన మాటలు. విపక్షం నుంచి అధికారపక్షం వైపు వెల్లువెలా మారిన నేతల ప్రవాహానికి చెక్ చెప్పేందుకు జగన్.. ‘ రాజధాని భూముల దురాక్రమణ’ అంటూ భారీ కథనాలు తన మీడియాలో రాస్తున్న సంగతి తెలిసిందే.

అదెలానంటే.. అమరావతి శంకుస్థాపన జరిగింది గత ఏడాది అక్టోబరులో. జగన్ మీడియా సంస్థ కథనం ప్రకారం.. రాజధాని ప్రకటనకు ముందు.. ఆ తర్వాత బాబు బ్యాచ్.. భారీగా బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఒకవేళ వారి ఆరోపణ నిజమనే అనుకుందాం.. మరి ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు? వారికిప్పుడే ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందన్న ప్రశ్న వేస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇది చంద్రబాబుకే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే రాజకీయం. దీన్ని ఎలా తిప్పి కొడతారన్నది చంద్రబాబు చతురత మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విషయానికి ఉత్తినే ఒత్తిడికి గురై.. ఏం మాట్లాడకూడదో.. అలాంటి మాటలు మాట్లాడితే మొదటికే మోసం రావటమే కాదు.. జగన్ కోరుకున్నదే జరుగుతుంది. ప్రత్యర్థి కోరుకున్నట్లే రియాక్ట్ కావటమంటే.. జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ లో బాబు మీద పైచేయి సాధించినట్లే. దీనికి తాజాగా బాబు నోటి నుంచి వచ్చిన మాటలే నిదర్శనం.

జగన్ మీడియా సంస్థ చేస్తున్న ఆరోపణలపై స్పందించిన బాబు.. ‘‘సాక్షిపై చర్యలు ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాం. ఎలాంటి చర్యలు ఉంటాయో చూస్తారు. డబ్బు పెట్టి కొనుక్కుంటే అడగటానికి మీరేవరు? కొనే విషయంలో నిబంధనలు పాటించారా లేదా? అన్నది చూడాలి. ఏదేదో రాసి విచారణ చేయమంటే చేయాలా? భూములు కొనుక్కుంటే చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఆస్తులుకొనకూడదు.. వ్యాపారం చేయొద్దంటే ఎలా?’’ అంటూ రియాక్ట్ అవుతున్న తీరు జగన్ కోరుకున్నట్లే బాబు స్పందన ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. మొత్తానికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించటం అత్యవసరం. చూస్తుంటే.. బాబు బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్లున్నారే..?
Tags:    

Similar News