ఎక‌రానికి 83 రూపాయ‌ల లీజు..ఇదీ టీడీపీకి బాబు చేసిన ప్ర‌జాసేవ‌...!

Update: 2019-12-01 14:30 GMT
ఎక‌రం భూమి.. అందునా రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో మంగ‌ళ‌గిరిని ఆనుకుని హైవే ప‌క్క‌నే ఉన్న ఆత్మ‌కూరులో స్థ‌లం.. మ‌రి లీజుకు తీసుకున్నా.. బ‌య‌ట‌వారికి ఇచ్చుకున్నా ఎంత ఉంటుంది? క‌నీసంలో క‌నీసం.. ల‌క్ష‌కు త‌క్కువ‌ కాదు. ఇది ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే..! అయితే, ప్ర‌భుత్వం త‌న‌దైన‌ప్పుడు చంద్ర‌బాబు ఊరుకుంటాడా ? త‌న పార్టీకి ఈ భూమిని ఎక‌రం కేవ‌లం రూ.83 చొప్పున లీజుకు ధారాద‌త్తం చేసేశారు. త‌న‌ది కాన‌ప్పుడు ఏదైనా చేయొచ్చు.. అనే సామెత‌ను బాబుగారు నిరూపించేశారు.

మొత్తంగా 3.62 ఎక‌రాల భూమిని టీడీపీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆయ‌న ఎకరం రూ.1000 (ఏడాదికి) లీజుకు త‌న ప్ర‌భుత్వంలో ఇచ్చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఆయ‌న‌కు, ఆయ‌న పార్టీకి ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. ఏపీ మాజీ సీఎం - టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు అగ్ని ప‌రీక్ష వంటి ప‌రీక్ష ఎదురైంది. ఆయ‌న‌కే కాకుండా మొత్తం పార్టీకి కూడా ఇప్పుడు ఈ ప‌రిణామం స‌వాలుగా మారిపోయింది. దీని నుంచి విజ‌యవంతంగా బ‌య‌ట ప‌డ‌క‌పోతే.. బాబుకు - పార్టీకి కూడా మ‌రింత ఎదురు దెబ్బ త‌గల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీ కేంద్ర కార్యాల‌యం నిర్మాణానికి మంగ‌ళ‌గిరిలో భారీ ఎత్తున అత్యంత విలువైన భూమిని కేటాయించుకున్నారు. దీనికి అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే ఆమోద ముద్ర వేసుకుని - 99 ఏళ్ల‌పాటు లీజుకు తీసుకుంటున్న‌ట్టు ప‌త్రాలు విడుద‌ల చేసింది.

ఈ లీజు నిమిత్తం ఏడాదికి ప్ర‌భుత్వానికి రూ.1000 క‌డితే చాల‌ని అప్ప‌ట్లో బాబు స‌ర్కారు జీవో కూడా విడుద‌ల చేసింది. ఇక‌, ఈ క్ర‌మంలో అప్ప‌టి అధికారాన్ని వినియోగించి ఈ భూమిలో వ‌డివ‌డిగా నిర్మాణం సాగించేశారు. డిసెంబ‌రు 6న అయినంత వ‌ర‌కు ప్రారంభించేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు.

అయితే, బాబు ఒక‌టి త‌లిస్తే.. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వం మ‌రొక‌టి త‌లుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాబుకు అగ్ని ప‌రీక్ష ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒక వైసీపీ ఎంపీ - ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. అత్యంత విలువైన భూమిని నాటి ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకు టీడీపీకి కేటాయించిందని - వెంటనే ఆ భూకేటాయింపు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ వారు వేర్వేరుగా ముఖ్యమంత్రి జగన్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. దానిని రెవెన్యూశాఖ కార్యదర్శికి రిఫర్‌ చేసింది. దీనిపై ఇప్పుడు రెవెన్యూశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇదిలావుంటే, ఇప్పటికే ఆ భూమిలో టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మించింది. డిసెంబరు ఆరో తేదీన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. మ‌రి ఈ వివాదం నుంచి బాబు ఎలా బ‌య‌ట ప‌డ‌తారో ? చూడాలి. మొత్తానికి ఇది కీల‌క స‌వాలుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News