గేట్స్‌ తో అనుబంధంపై బాబు ఏమ‌న్నారంటే!

Update: 2017-11-17 14:01 GMT
పొడిగి.. పొగిడించుకోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు కొత్త‌కాదు. అయితే, ఈ విష‌యంలో మిగిలిన వారి కంటే కాస్తంత ఎక్కువగా చ‌దివిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... రాష్ట్రానికి వ‌చ్చిన నేత‌ల‌ను త‌న పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతుంటారు. ఈ త‌ర‌హా యావ చంద్ర‌బాబులో ఎక్కువ‌న్న విష‌యాన్ని ఏ ఒక్క‌రూ కాద‌న‌లేకున్నా... బాబు పొగ‌డ్త‌ల్లో ఎంతో కొంత విష‌యం ఉంద‌న్న మాట‌ను మాత్రం కాద‌న‌లేని స‌త్య‌మే. కొంద‌రికి సెల్ఫ్ డ‌బ్బాలా అనిపించినా... రాష్ట్రానికి వ‌చ్చే రాజ‌కీయ నేత‌లు - పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌న‌దైన శైలిలో పొగిడేసి... రాష్ట్రానికి ఏది కావాలో... దానిని సాధించుకునే ఉద్దేశ్యం బాబులో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా బాబు త‌న‌ను తాను కూడా పొగిడేసుకుంటారు. అయితే స‌మ‌యం, సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు ఓ నాలుగు మాట‌లు ఎక్కువ‌గా వ‌చ్చినా.. ప‌ని అయ్యిందా?  లేదా? అన్న‌దే బాబు చూస్తారు. అయినా ఇప్పుడు ఈ విష‌యం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే... సాగ‌ర న‌గ‌రం విశాఖ కేంద్రంగా గ‌డ‌చిన మూడు రోజులుగా జ‌రుగుతున్న అగ్రి టెక్‌-2017 స‌ద‌స్సు నేటి మ‌ధ్యాహ్నం ముగిసింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు - గేట్స్ మిలిండా ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ హాజ‌రయ్యారు.

ఫౌండేష‌న్ త‌ర‌ఫున సాగులో లాభాల కోసం వివిధ దేశాల్లో కొన‌సాగిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ఏక‌రువు పెట్టిన గేట్స్‌... ఏపీలో తామేం చేయాల‌నుకుంటున్నామో - ప్ర‌భుత్వం ఏ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకోవాలో సూచ‌నాప్రాయంగా చెప్పేశారు. ఆ త‌ర్వాత మైకందుకున్న చంద్ర‌బాబు... గేట్స్ వ్య‌క్తిత్వంపై సుదీర్ఘంగానే ప్ర‌సంగించారు. అస‌లు బిల్ గేట్స్‌తో త‌న‌కున్న అనుబంధం ప్ర‌స్తావ‌న‌తో ప్ర‌సంగాన్ని మొద‌లెట్టిన చంద్రబాబు... ఆ అనుబంధంలోని చాలా అంశాల‌ను త‌న‌దైన రీతిలో చెప్పారు. గేట్స్‌ తో తాను తొలిసారిగా మాట్లాడిన సంద‌ర్భాన్ని ఆస‌క్తిగా చెప్పుకొచ్చిన చంద్ర‌బాబు... త‌న వాగ్దాటితో గేట్స్ ఎంత‌టి మైమ‌ర‌పున‌కు గురైన విష‌యాన్ని చెప్పారు. ఢిల్లీలో తాను తొలిసారిగా గేట్స్‌తో స‌మావేశ‌మ‌య్యాన‌ని, ఆ సంద‌ర్భంగా త‌న‌కు గేట్స్ కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే స‌మ‌యం ఇచ్చార‌న్నారు. అయితే ఆ ప‌ది నిమిషాల్లోనే త‌న వాగ్దాటికి అచ్చెరువొందిన గేట్స్‌... స‌ద‌రు స‌మావేశాన్ని 40 నిమిషాల వ‌ర‌కు ముగించ‌నే లేద‌ని చెప్పారు. అస‌లు గేట్స్‌కు ల్యాప్ టాప్ ద్వారా ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన తొలి భార‌తీయుడిని తానేన‌ని కూడా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

ఆ క్ర‌మంలో గేట్స్‌ తో త‌న అనుబంధాన్ని కొన‌సాగించాన‌ని, ఈ క్ర‌మంలోనే 20 ఏళ్ల క్రితం గేట్స్ త‌న‌ను అమెరికాలో జ‌రుగుతున్న ఓ కాక్ టైల్ పార్టీకి ఆహ్వానించార‌న్నారు. అయితే ఈ త‌ర‌హా క‌ల‌యిక రాజ‌కీయంగా ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని, తాను రాలేన‌ని సూచించాన‌ని బాబు చెప్పారు. దీంతో వాస్త‌వాన్ని గుర్తించిన గేట్స్‌ తో ఆ పార్టీ త‌ర్వాత త‌న‌తో వేరుగా భేటీ అయ్యార‌ని తెలిపారు. ఆ త‌ర్వాతి కాలంలో హైద‌రాబాదులో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గేట్స్ ఒప్పుకున్నార‌న్నారు. అనంత‌రం గేట్స్ అంత‌రంగాన్ని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... సంపాదించిన మొత్తంలో సేవా కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు పెట్టేవారు చాలా అరుదుగా ఉంటార‌ని, అయితే అందుకు గేట్స్ మిన‌హాయింపేన‌ని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ద్వారా తాను సంపాదించిన దాంట్లో మెజారిటీ వాటాను సేవా కార్య‌క్ర‌మాల‌కు వెచ్చించాల‌ని నిర్ణ‌యించ‌డం గేట్స్ గొప్ప మ‌న‌సుకు నిద‌ర్శ‌న‌మి పేర్కొన్నారు. త‌న సంపాద‌న‌లో వార‌సుల‌కు గేట్స్ ఇచ్చింది చాలా త‌క్కువేన‌ని కూడా చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ త‌ర‌హా వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ద‌ని, సంప‌న్నులు గేట్స్ బాట‌లో న‌డిస్తే స‌మాజానికి మేలు జ‌రుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News