''ఛేంజ్‌'' కోసం బెజవాడకు బాబు

Update: 2015-06-12 06:28 GMT
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నాకే హైదరాబాద్‌కు వెళతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిగా ఏపీ బాగోగులు చూడాల్సిన బాబుకు..ఈ హైదరాబాద్‌ మీద మమకారం ఏమిటంటూ అప్పట్లో కస్సుమన్న తెలుగు తమ్ముళ్లు చాలామందే ఉన్నారు. అయినప్పటికీ అధినేతతో ఆ విషయం చెప్పే ధైర్యం లేని వారు కామ్‌గా ఉన్న పరిస్థితి.

కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌ చేసేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్నది లేకుండా చేస్తానని ప్రతిన పూనారు. ఈ మాటను ఆయన పదే పదే ప్రస్తావించే పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మొత్తంగా లేకుండా చేయటం సాధ్యం అయ్యే అవకాశం లేనప్పటికీ.. బాబును హైదరాబాద్‌లో ఉండకుండా చేయటంలో మాత్రం కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొద్దిరోజుల కిందట వెలుగు చూసిన ఓటుకు నోటు వీడియోతో పాటు.. చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో సీడీ ఏపీ అధికారపక్షాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా భారీ డ్యామేజ్‌ పొందిన తెలుగుదేశం పార్టీకి కాస్తోకూస్తో ఊరటనిచ్చే అంశం.. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఏపీలో అధికారపక్షంపై కాస్తంత సానుభూతిని పెంచటమే.

నిజానికి బాబు మీద సానుభూతి కంటే కూడా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో.. ఏపీ విపక్ష నేత జగన్‌ చేతులు కలిపారన్న సందేశం సీమాంధ్రలో విపరీతంగా ప్రచారం కావటంతో.. కేసీఆర్‌తో ఫైట్‌ చేసే మొనగాడిగా చంద్రబాబు ఇప్పుడు మార్కులు కొట్టేస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు.. తనకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో సీడీల నేపథ్యంలో కొంతకాలం ఏపీ తాత్కలిక రాజధాని విజయవాడపై ఫోకస్‌ పెట్టాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.

అనవసరమైన చికాకులు.. ఇష్యూలతో కాకుండా ఏపీలోని పాలన మీద ఫోకస్‌ పెట్టాలన్న సూచనలు ఈ మధ్య పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఏపీలో సీఎంవోను స్టార్ట్‌ చేసిన సీఎం చంద్రబాబు.. వీలైనంత త్వరగా అందులోకి షిఫ్ట్‌ కావాలని భావిస్తున్నారు. కొద్దిగా పనులు పెండింగ్‌లో ఉండటంతో వారం వ్యవధిలో పనులు మొత్తం పూర్తి చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతానికి వారానికి మూడు రోజుల పాటు విజయవాడలో ఉండేలా బాబు ప్లాన్‌ చేస్తున్నారు. వీలైతే మరిన్ని రోజులు ఏపీలో ఉండాలన్న డిమాండ్‌ మంత్రుల నుంచి రావటం గమనార్హం. మొత్తమ్మీదా ఓటుకు నోటు వ్యవహారం పుణ్యమా అని బాబు బెజవాడ వెళ్లే విషయంలో మరింత ఇంట్రస్ట్‌ పెరిగిందని చెబుతున్నారు. అంటే.. కేసీఆర్‌ పాక్షికంగా విజయం సాధించినట్లేనా?

Tags:    

Similar News