తెలంగాణ తమ్ముడి మాటతో బాబుకు షాక్

Update: 2016-06-26 05:08 GMT
ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదన్న చందంగా ఏపీ తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారంటూ వాపోతున్నారు తెలంగాణ తెలుగు తమ్ముడు ఒకరు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం సదరు నేతకు షాక్ తినేలా చేసిందట. రాజకీయ నాయకులు కాంట్రాక్టులు చేయటం.. తాము పనులు చేపట్టే ప్రాంతంలో ఇవ్వాల్సిన వారికి ఇవ్వాల్సినంత ఇచ్చేసి.. తమ పని తాము చేసుకోవటం అలవాటే. అయితే.. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతకు ఒక కాంట్రాక్ట్ దక్కిందట.

సదరు కాంట్రాక్ట్ ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిందట. ఈ కాంట్రాక్ట్ లభించిన వ్యక్తి చిన్నోడేం కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనల్గొండ జిల్లాలో టీటీడీపీ తరఫు ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఉంది. తాము పవర్ లో ఉన్న రాష్ట్రంలో కాంట్రాక్ట్ దొరకటంతో హ్యాపీగా ఫీలైన ఆయన.. తనకొచ్చే లాభాల్ని లెక్కలేసుకోవటంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు.

కాంట్రాక్ట్ పనుల్ని షురూ చేస్తున్న ఆయనకు ఊహించని షాక్ తగిలిందట. కాంట్రాక్ట్ పనుల్ని స్థానిక టీడీపీ తమ్ముడు అడ్డుకోవటంతో షాక్ తిన్న ఈ టీటీడీపీ తమ్ముడు.. ఆయనతో మాట కలిపారట. పని చేసుకోవటానికి తమకేం అభ్యంతరం లేదని.. కాకుంటే తమకు ఇవ్వాల్సిన 5 శాతం వాటా మాటేమిటని అడిగాడట. దీంతో కంగుతిన్న నల్గొండ జిల్లా టీ తమ్ముడు.. ఈ ఇష్యూను టీటీడీపీ పెద్దను కలిసి తన పరిస్థితిని చెప్పుకున్నారట.

ఈ విషయాన్ని వెంటనే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారట టీటీడీపీ ముఖ్యనేతల్లో ఒకరు. తన దృష్టికి వచ్చిన ఈ ఉదంతంపై విస్మయానికి గురైన బాబు.. సదరు గుంటూరు జిల్లా నేతను సర్దుకుపోవాలని చెప్పారట. అధినేత ముందు నసిగినా.. తన వాటా తనకు ఇవ్వకపోతే ఎలా అంటున్న తీరుతో టీ తమ్ముడి నోట మారటం రావటం లేదట. సొంతోళ్ల విషయంలోనూ మరీ ఇలానా? అంటూ వేస్తున్న ప్రశ్నకు.. రిలేషన్ రిలేషనే.. బిజినెస్ బిజినెస్సే అంటూ చెబుతున్న మాట టీడీపీ వర్గాల్లో చర్చగా మారిందని చెబుతున్నారు.
Tags:    

Similar News