టీడీపీ స‌త్తా...బాబు మేక‌పోతు గాంభీర్యం

Update: 2018-07-09 06:35 GMT
జమిలి ఎన్నికల ప్ర‌తిపాద‌ తెలుగుదేశం పార్టీని గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది. ఓ వైపు జ‌మిలీ ఎన్నిక‌ల‌కు ప‌లు పార్టీలు సిద్ధ‌మ‌వుతుండ‌గా..మ‌రోవైపు ఆ పార్టీలోనే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డంపై ద్వంద్వ వైఖరి క‌నిపిస్తోంది. ఒకపక్క ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధ‌మే అంటూ తొడగొడుతున్న ఆ పార్టీ... మరోపక్క అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు జరిపిస్తామంటే ఒప్పుకోబోమని వ్యతిరేకిస్తుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఇంత‌కూ ఆ పార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మా?  లేక ప్ర‌చారం కోస‌మే బ‌స్తీమే స‌వాల్ అంటోందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

ఢిల్లీలో జమిలీ ఎన్నికల విషయమై టీడీపీ ఎంపీలు తోట నర్సింహం - కనకమేడల రవీంద్రకుమార్ లా కమిషన్ ముందు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావని - వాటి పేరిట ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే వ్యతిరేకిస్తామని తెలిపారు. లోక్‌ సభను ముందుగా రద్దుచేసి ఎన్నికలు నిర్వహించినా - టీడీపీ మాత్రం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయబోదని - నిర్దేశిత ఐదేండ్లపాటు ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లే పరిస్థితి లేదని ఎంపీలు వివరించారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ట్యాంపరింగ్‌ కు అవకాశం ఉంటుందని లా కమిషన్‌ కు తెలిపామని చెప్పారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే నిష్పక్షపాతంగా ఉంటుందని అన్నారు.

ఇలా 2019లో షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తే సిద్ధంగా ఉన్నామని ఓ వైపు పార్టీ త‌ర‌ఫున వెల్ల‌డిస్తున్న తెలుగుదేశం నాయ‌కుడు చంద్ర‌బాబు మ‌రోవైపు ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ..ముంద‌స్తు రాబోతోంది?  మీరు సిద్ధం కండి అంటూ పార్టీ నేత‌ల‌కు హిత‌బోధ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మిగ‌తా పార్టీల‌న్నింటికంటే ముంద‌గా ముంద‌స్తు జపం వినిపించింది చంద్ర‌బాబే అనే సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా..ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా మ‌న‌దే గెలుపు అంటూ  కూడా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ఇప్పుడు ముంద‌స్తు జ‌మిలీ ఎన్నిక‌లు వ‌స్తే...వెన్నుచూప‌డం అనేది కార‌ణాలు ఏవైనా చంద్ర‌బాబు ఆండ్ టీం మేక‌పోతు గాంబీర్యాన్ని చాటుతున్నాయ‌ని అంటున్నారు.


Tags:    

Similar News