ఇదే మాట మోడీ అంటే పరిస్థితేంటి బాబు?

Update: 2016-12-28 04:13 GMT
మాట జారటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారింది. తనకున్నకొన్ని అభిప్రాయాల్ని పరిమిత చట్రంలో నుంచి చూసి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం తగదు. ఇలాంటి మాటలే తర్వాతి కాలంలో వెంటాడి వేధిస్తుంటాయి. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలోనూ బాబు చేసిన వ్యాఖ్యలు.. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న పదేళ్లు పడాల్సిన పరిస్థితి.

ఆ అనుభవాల్ని గుర్తుంచుకొనైనా.. ఆచితూచి మాట్లాడాలన్న విషయాన్ని బాబు మర్చిపోతుండటమే అసలు సమస్య. తాజాగా తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో భారత ఆర్థిక సంఘం 99వ వార్షిక సదస్సు ప్రారంభమైంది.దీనికి పలువురు ఆర్థికవేత్తలు.. పరిశోధకులు హాజరయ్యారు. వారితో మాట్లాడే సందర్భంలో తానూ ఎకనామిక్స్ స్టూడెంటేనని చెప్పారు. డీఎల్ నారాయణ లాంటి వారి దగ్గర పాఠాలు విన్నానని చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోనే తాను చదివానని.. వర్సిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టామని.. అయితే.. ఎక్కువ నిధులు ఇస్తే చెడిపోతారని.. బద్ధకం పెరిగిపోతుందని.. అందుకే పరిమిత వనరుల్చి పెద్ద ఛాలెంజ్ లను వీసీ ముందు ఉంచామని.. పరిశోధనల పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే వర్సిటీలు స్వయం వనరుల్ని సమీకరించుకోవాల్సి ఉంటుందన్నారు. తాను నిధులు ఇవ్వాల్సిన వర్సిటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు.. రేపొద్దున కేంద్రం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తే ఏమవ్వాలి. బాబు చెప్పినట్లే.. ప్రధాని మోడీ కూడా రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తే బద్ధకం పెరిగిపోతుందని.. అందుకే పరిమిత నిధులు ఇచ్చి పెద్ద ఛాలెంజ్ లు ముఖ్యమంత్రుల ముందు ఉంచామని.. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఎవరికి వారు స్వయం వనరుల్ని సమీకరించుకోవాలని వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది?

అందుకే తొందరపడి రెండు మాటలు అనే ముందు.. ఇలాంటి వ్యాఖ్యలు తనకు కూడా తగులుతాయా? అన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. తాను కూడా ఎకనామిక్స్ స్టూడెంట్ అని చెబుతున్న చంద్రబాబు.. నిధులు ఎక్కువ అందుబాటులో ఉంటే బద్ధకం పెరిగిపోతుందన్న సూత్రం సాంకేతికంగా ఎలా కరెక్ట్ అన్న విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News