కాపుల కోసం బాబు వ్యూహం రెడీ

Update: 2016-01-22 13:22 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తన రాజకీయ వ్యూహానికి పదునుపెడుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదురవుతున్న కీలక సమస్యను ఛేదించేందుకు చంద్రబాబు వ్యూహాం సిద్ధం చేశారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు, తమకు సరైన ప్రాధాన్యం దక్కాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈనెల 31న కాపునాడు సభను నిర్వహించేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సభ లక్ష్యం తెలుగుదేశం పార్టీ - ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో తమకు న్యాయం జరగలేదనే అంశాన్ని తెరమీదకు తేవడం. అయితే దీన్ని తిప్పికొట్టేందుకు బాబు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఒక‌వైపు రాజ‌కీయ నిర్ణ‌యంతో పాటు మ‌రోవైపు సినీ గ్లామర్‌ ను కూడా ఇందుకు ఉప‌యోగించ‌నున్న‌ట్లు స‌మాచారం.

కాపునాడు సభకు సన్నాహాలు ప్రారంభం అవుతున్నప్పటి నుంచి ఈ కుంపటి రాజుకోవ‌డం వెనుక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని తెలుగుదేశం సందేహం వ్య‌క్తం చేస్తోంది. ఇటీవ‌లే ఆ పార్టీ నేత భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌లికిన నేప‌థ్యంలో టీడీపీ దీన్ని రూడీ చేసుకుంది. ఈ నేప‌థ్యంలో స‌భ‌ను అదేరీతిలో ఎదుర్కునేందుకు చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌లు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప‌లు అంశాలు తెర‌మీద‌కు తేనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి క‌ట్ట‌బెట్టిన రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి కాపు నాయ‌కుడికే ఇవ్వ‌డం, కేబినెట్ - ఎమ్మెల్సీ - ఇతర నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించనున్నారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌దవే కాకుండా కీల‌క‌మైన హోంశాఖ ప‌ద‌వి కట్ట‌బెట్టిన తీరును కూడా తెలియ‌జెప్ప‌నున్నారు. దీంతోపాటు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్ర‌త్యేక నిధి కేటాయించ‌డం, కాపులను బీసీల్లో చేర్చే అంశం పై మంత్రి వర్గం స‌మావేశంలో నిర్ణయించ‌డం,  కమిషన్ ఏర్పాటు చేయ‌డం, త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం గురించి కూడా ప్ర‌ముఖంగా వివ‌రించ‌నున్నారు.

ఇదిలాఉండ‌గా మ‌రో ప్ర‌భావ‌వంత‌మైన వేదిక అయిన సినీ గ్లామ‌ర్‌ ను కూడా కాపు సామాజిక వ‌ర్గం కోణంలో ఉప‌యోగించేందుకు చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల వేదిక‌గా ఈ కాపుల కాక‌కు బీజం ప‌డుతుండ‌టంతో అదే జిల్లాకు చెందిన సినీ దర్శకుడు

స్టార్ డైరెక్ట‌ర్ వీవీ వినాయక్‌ ను కాపుల కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏం చేసిందో వివ‌రించేందుకు తెర‌మీద‌కు తీసుకువ‌చ్చేందుకు ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా కాపుల అసంతృప్తిని ప్రాథ‌మిక స్థాయిలోనే నివారించేలా బాబు వేగంగా అడుగులు వేస్తున్నారు.
Tags:    

Similar News