ప‌వ‌న్ శ‌క్తిని ప్ర‌త్యామ్నాయం రెడీ చేస్తున్న బాబు

Update: 2016-05-02 16:38 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాపు కుల‌స్తుల రాజ‌కీయ అడుగుల‌ను అధికార తెలుగుదేశం పార్టీ జాగ్ర‌త్త‌గా విశ్లేషిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. కాపుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లుకాలేద‌ని, రుణాల పంపిణీలో ఆశించిన మేర ప్ర‌భుత్వం అడుగులు వేయ‌డం లేద‌ని కాపునాడు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అసంతృప్తి, జ‌న‌సేన పార్టీకి రాజ‌కీయ గుర్తింపు, 2019 ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగుతాన‌నే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌ల‌ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త స‌మీక‌ర‌ణాలు ప‌రిశీలిస్తోంది. కాపు నాడులోని నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు అదే మార్క్‌ను ఉప‌యోగించేందుకు టీడీపీ అదినాయ‌క‌త్వం స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెప్తున్నాయి.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కటానికి పవన్ రూపంలో కాపు బలగమంతా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసింది. కానీ ప్రస్తుతం జనసేన రూపంలో దేశం పుట్టిముంచుతుందనే అనుమానాలు కూడా అధిష్టానం మదిలో రేకెతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగుదేశంలో కాపు యువరక్తం తీసుకురావటానికి పార్టీ ప్రయత్నాలు చేస్తుందని పార్టీ స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు - నారాయణ - చిన రాజప్ప - సీనియర్ నాయకులు తోట త్రిమూర్తులు - తోట నరిసింహం - మండలి బుద్దప్రసాద్ తదితర నాయకులు కాపు సీనియర్లుగా టీడీపీ లెక్కిస్తోంది. అయితే వీరిపైనే పూర్తి భ‌రోసా పెట్టుకోకుండా ప్ర‌త్యామ్నాయాన్ని సిద్ధం చేస్తోంద‌ని చెప్తున్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు అనగానే సీజనల్ నాయకుడిగా రాజ‌కీయాల్లో పేరుందని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గంటా మంత్రిగా ఉంటారని, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో దానికి వెన్నుదన్నుగా నిలిచి పార్టీకి సహకరించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లోకి విలీనం అయిన వెంటనే కాంగ్రెస్‌లో మంత్రిగా చక్రం తిప్పారని, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ అదే త‌ర‌హా ప్ర‌య‌త్నం చేశార‌ని గుర్తుచేసుకుంటున్నారు. ఒకవేళ జనసేన విజృంభిస్తే గంటాతోపాటు తూర్పుగోదావ‌రి,పశ్చిమ‌గోదావ‌రి నాయకులంతా పవన్‌బాటలో నడిచే ప్రమాదం ఉందని తెలుగుదేశం వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగుదేశంలో సెకండ్ జనరేషన్ తీసుకురాకపోతే ఇబ్బందుల్లో పడతామనే ఆలోచనతో కాపు యువనాయకుల‌ను తెరమీదకు తీసుకొస్తున్నార‌ని చెప్తున్నారు.

ద్వితీయ శ్రేణి కాపునేత‌ల్లో భాగంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న - ఎమ్మెల్యే బొండా  ఉమామహేశ్వరరావులను రంగంలోకి దించి సీనియర్ కాపు నాయకులకు సమాంతరంగా వీరిని తీర్చిదిద్దుతున్నార‌ని టీడీపీలోని వ‌ర్గాల స‌మాచారం. ఇప్పటికే బొండా రాష్ట్రవ్యాప్తంగా కాపు నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే కాపు కార్పోరేషన్ విశిష్టతను రాష్ట్రమంతా తిరిగి అన్నిజిల్లాలలో కాపులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు అసెంబ్లీలో అటు రాజకీయాలలో దూసుకెళ్తుండ‌టం పార్టీ నిశితంగా గ‌మ‌నిస్తోంది. వాస్తవంగా కాపులు అనగానే వంగవీటి రంగాను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అదే రంగా శిష్యూడిగా పేరుపొందిన బొండా ఉమా కాపు గ్లామర్‌ను తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధిష్టానం సీనియర్లకు సమాంతరంగా జూనియర్లను తెరమీదకు తీసుకొచ్చి రెండవ జనరేషన్‌కు ఊతం ఇవ్వ‌డం ద్వారా మార‌బోయే రాజకీయ సమీకరణాలకు సైతం సిద్ధంగా ఉంటున్నార‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.
Tags:    

Similar News