బాబు చేయించిన సర్వే రిజల్ట్ ఏం చెప్పిందంటే..

Update: 2016-07-08 07:26 GMT
మారిన రాజకీయాలకు తగ్గట్లే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటం కోసం తరచూసర్వేలు నిర్వహించుకోవటం ఈ మద్య ఒక అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో తరచూ చేయించే సర్వేలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ.. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? తాము తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం సర్వేలు చేయించుకోవటం అలవాటైంది. తాజాగా అలాంటి సర్వేనే ఒకటి చేయించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన నేపథ్యంలో తమ సర్కారు పని తీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై ఆయన ఒక సర్వేను చేయించగా..వాటికి సంబంధించిన ఫలితాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి సర్వే ఫలితాలపై చంద్రబాబే స్వయంగా సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి అందరిముందు పెట్టారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో మంత్రులు..పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

సర్వే ఫలితాల్ని చూస్తే.. ప్రభుత్వ పని తీరు మీద మెజార్టీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా.. సగానికి పైగా ప్రజలు తమ తమ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నట్లుగా సర్వే ఫలితం తేల్చింది. 30 నుంచి 35 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఫర్వాలేదన్న సర్వే ఫలితం.. 25 నుంచి 30 శాతం ఎమ్మెల్యేల పని తీరు అస్సలు బాగోలేదని కుండబద్ధలు కొట్టింది.

బాబు పాలన మీద మెజార్టీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా.. అందుకు భిన్నంగా ఎమ్మెల్యేల పని తీరు మాత్రం ప్రజలు పెదవి విరవటంపైన బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా.. పాలన విషయంలో పనితీరు ఇంకా మెరుగుపర్చుకోకపోతే ఎలా? అంటూ బాబు ఫైర్ అయినట్లు చెబుతున్నారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల్ని మార్చటం ఎలా?వారి పని తీరును మెరుగుపర్చటం ఎలా? అన్న అంశాలపై భేటీలో సుదీర్ఘ చర్చసాగినట్లుగా తెలుస్తోంది. పని తీరు బాగోని ఎమ్మెల్యేలను సంస్కరించేందుకువీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు ఏకగ్రీవ ఆమోద ముద్రపడిందని చెబుతున్నారు. ఇంతకీ.. దారుణ పని తీరు ఉన్న ఎమ్మెల్యేలుఎవరు..?
Tags:    

Similar News