ఎమ్మెల్యేలపై సీఎం ఇలా ఆరా తీస్తున్నారు

Update: 2016-07-31 11:30 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ జ‌పిస్తున్న మంత్రం స‌ర్వేలు. ప్ర‌భుత్వ పనితీరు, మంత్రుల ప‌రిపాల‌న విధానం - ఎమ్మెల్యేల వ్య‌వ‌హార శైలి త‌దిత‌ర అంశాల‌పై బాబు స‌ర్వేలు నిర్వ‌హించిన‌ట్లు పేర్కొంటూ ర్యాంకులు ప్ర‌క‌టిస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క్లాస్ తీసుకుంటున్నారు. ఇంత‌కీ బాబు నిర్వ‌హించే స‌ర్వేకు ప్రాతిప‌దిక ఏంటి? ఎక్క‌డ ఆ స‌ర్వేలు చేస్తున్నారు? ఎవ‌రు వాటిని నిర్వ‌హిస్తున్నారు అనే ఆస‌క్తిక‌ర‌మైన సందేహానికి ఇదిగో సమాధానం.

టీడీపీ అధినేత‌ - రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో నిర్వ‌హించిన సమావేశంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై స‌ర్వే నిర్వ‌హిస్తాన‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున బ‌రిలో ఉంచేవారి కోసం ఇప్ప‌ట్నుంచి రంగం సిద్ధం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న మేర‌కు వివిధ జిల్లాల్లో  సర్వే సాగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సమగ్ర నివేదిక కావాలని అడిగిన నేప‌థ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెలాఖరుకు ముగించున్నారని. ప్రతీ నియోజవకర్గంలో 300 మంది సభ్యులకు తగ్గకుండా ఇందులో వారి అభిప్రాయాల్ని ట్యాబుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పాలకపక్ష - ప్రతిపక్ష ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆరాతీసినట్లు తెలుస్తోంది. 16 ప్రశ్నల్ని సంధించి - వాటి సమాధానాల్ని ట్యాబ్‌ ల్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి డ్యాష్‌ బోర్డుకు అనుసంధానం చేస్తునట్లు తెలిసింది.

ఇక ఎమ్మెల్యేల గురించి తెలుసుకునే ప్ర‌శ్నావ‌లిలో ప్రధానంగా ''మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్ధవంతంగా అమలు చేసి, ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారా?, ఇంతకంటే సమర్థుడైన అభ్యర్థి మీ నియోజకర్గంలో ఉన్నారా?, ఎమ్మెల్యే పేరు చెప్పి అనుచరగణం అధికారులకు బెదిరింపులు చేస్తున్నారా? ఎక్కడైనా అక్రమాలకు పాల్పడుతున్నారా?'' వంటి పదహారు ప్రశ్నలతో జిల్లాలో సర్వే సాగుతోంది. సర్వే సిబ్బంది అత్యంత పగడ్బందీగా సర్వే చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో - అన్ని వర్గాల ప్రజల నుంచి వివరాల్ని రాబడుతున్నారు. ఉద్యోగులు - నిరుద్యోగులు - రైతులు - కార్మికులు - మహిళలు - యువకులు - విద్యార్థులు - విశ్రాంత ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల నుంచి వివరాల్ని రాబడుతున్నట్లు తెలిసింది. మొత్తంగా ప‌క‌డ్బందీ స‌ర్వే ద్వారా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అంచ‌నా వేసేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News