బాబు సీఎం కుర్చీ ఎక్కి 23 ఏళ్లు

Update: 2018-09-01 17:44 GMT
నారా చంద్రబాబు నాయుడు. భారత రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారికి ఆయన గురించి చాలా సులభంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించి మామపైనే పోటీ చేస్తానంటూ యవ రాజకీయ నాయకుడిగా సంచలన ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.... ఆ మాటకొస్తే తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. ఆయన తన రాజకీయ ఎదుగుదల కోసం పిల్లనిచ్చిన మామనే గద్దె దింపిన ఘన చరిత్రను మూట కట్టుకున్నారు. ఇది తనకు భవిష్యత్‌లో చేటు చేస్తుందని తెలిసినా ఆయన వెరవకపోవడం చంద్రబాబు రాజకీయ పరిణితి అనే కంటే ఆయనకు సహకరించిన వారిచ్చిన ధైర్యమే అనాలి. తొలిసారి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదు. బలవంతంగా ఆ కుర్చీని లాక్కున్న ముఖ్యమంత్రి.  ఈ సంఘ‌ట‌న జ‌రిగి 23 ఏళ్ల‌యింది. బహుశా దేశ చరిత్రలో కాని, భవిష్యత్‌ లో కాని ఇలాంటి సంఘటన జరిగే అవకాశాలు లేవు... రావు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మంత్రిగా కంటే కూడా ముఖ్యమంత్రిగానే ఎక్కువ కాలం పని చేశారు. ఈ పదవికి ఆయన పదేళ్లు దూరంగా ఉన్నారు. ఇంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వారు సమైక్య రాష్ట్రంలో మరెవరూ లేరు. ఇది ఆయనే సాధించిన రికార్డు. అయితే రాజకీయ వ్యూహాలతోనూ, ఎత్తుగడలతోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు కాని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రి కాలేదని రాజకీయ విశ్లేషకులు అంటారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తాను రాష్ట్రానికి సీఈవో అని  పిలిపించుకున్న చంద్రబాబు నాయుడు ఆ ఐదేళ్లు సమైక్య రాష్ట్రాన్ని ఓ కార్పొరేట్ కంపెనీలాగే చూశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో వ్యవసాయం దండగ అని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అందుకు తగిన మూల్యాన్ని 2004 సంవత్సరంలో చెల్లించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వ్యవసాయానికి శోభ తీసుకువచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి. ఈ ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు నాయుడు ఓ నిజాన్ని గ్రహించారు. అదే ఎన్నికల మ్యానిప్లేషన్. ఈ పనిని తర్వాతర్వాత సమర్ధవంతంగా నిర్వహించి ముఖ్యమంత్రి కాగలిగారు. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కూడా ఇదే ఫార్ములాతో ఎన్నికలకు వెళ్లారాయన. ఆ ఫార్ములాతోనే భారతీయ జనతా పార్టీతోనూ, పవన్ కల్యాణ్ తోనూ కలిసారు. బొటిబొటీ మెజార్టీతో తన వారిని గెలిపించుకుని అధికార పీఠం ఎక్కారాయన. అయితే ఇప్పుడు కూడా గతంలో ఆయన చేసిన తప్పులనే తిరిగి తిరిగి చేస్తున్నారని పరిశీలకులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్‌కే పరిమితం చేసి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే పనిని అమరావతిలో చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాలు... ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవిష్యత్‌లో ప్రత్యేక డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. అయినా.... మన పిచ్చి కాని.... ఎప్పుడో వచ్చే దానికి చంద్రబాబు బాధ్యులెలా అవుతారు. ఇప్పుడు మన పబ్బం గడుస్తోంది కదా అనుకోవడమే నేటి రాజకీయం ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News