రాజకీయ పార్టీలలో ఈ మధ్య పాలన పగ్గాలు చేపట్టడం అనే చర్చ సీరియస్ గా సాగుతోంది. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ చేపడతారా లేదా అన్న చర్చలకు తోడుగా తెలుగు రాష్ర్టాలు కూడా సిద్ధం అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఆ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా అప్పగిస్తారనే చర్చ సీరియస్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. అదే తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంపై ఆయన తండ్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దృష్టి సారించారనే వార్తలు వెలువడుతున్నాయి.
వాస్తవానికి కుమారుడికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలనే దిశగా బాబు అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ చేయడంతో పాటు పార్టీ ప్రచారం కోసం వివిధ జిల్లాల్లో పర్యటింపచేస్తున్నారు. మరోవైపు అధికారం చేపట్టిన పది నెలల నుంచి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చే నేతలకు.. ఒకసారి లోకేశ్ బాబును కూడా కలవకపోయారా అని బాబు చెబుతున్నారని, అలా కుమారుడికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని నేతలు గుర్తించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు లోకేష్ సైతం పార్టీ ఆఫీసులో మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించారు. జెడ్పీ చైర్మన్ లతో కూడా భేటీ అయి వారి డిమాండ్లు తెలుసుకొని సర్కారుకు విన్నవించారు. గత మహానాడుతోనే లోకేష్ కు క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని మొదలుపెట్టినట్లు సమాచారం.
అయితే కుమారుడి విషయంలో ఎంతచేసినా.. తెలుగుదేశంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీనియర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేలా చంద్రబాబు వ్యూహం రూపొందించారని సమాచారం. తానే నిర్ణయం ప్రకటించడం కాకుండా కిందిస్థాయి నుంచి ఈ డిమాండ్ చేయించి, ఆ తర్వాత ఎంపిక చే స్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పథకంలో భాగంగానే పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు మాట్లాడారని అంటున్నారు.
ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అటు తెలంగాణలోను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్, వార్డు, మం డల, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ఎక్కడికక్కడ లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ నేతల నుంచి వచ్చేలా ఎన్‌టీఆర్ భవన్ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ఆయా సమావేశాల్లో లోకేశ్‌కు పార్టీలో కీలకమైన పదవి అప్పగించాలని కోరుతూ తీర్మానాలు సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి సమావేశాల్లోనూ లోకేశ్‌కు కీలక బాధ్యతలపై తీర్మానాలు చేయించటంతో పాటు నేతల నుంచి డిమాండ్లు చేయించనున్నట్టు సమాచారం. వచ్చే నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో టీడీపీ మహానాడు జరగనుంది. ఆ మహానాడులోనూ లోకేశ్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్‌కు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించాలనేది బాబు వ్యూహమని చెబుతున్నారు.