సెంటిమెంటును పిండుతున్న చంద్రబాబు

Update: 2015-10-06 15:59 GMT
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. కేసీఆర్ తో ఎన్నో ఏళ్ల సాంగత్యం ఉన్న చంద్రబాబు కూడా ఇప్పుడు తెలంగాణ తరహాలో సీమాంధ్ర సెంటిమెంటును రంగరించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం సెంటిమెంటుతో ముడిపడి ఉండడంతో ప్రతి అడుగులోనూ ఆయన సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో స్మారక స్థూపాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల గ్రామాల నుంచి మట్టిని తీసుకు రానున్నారు. దీనిని వట్టినే తీసుకొస్తే ఉపయోగం ఉండదు కదా. అందుకని వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజులూ ఆయా గ్రామాల్లో రాష్ట్ర విభజన, చంద్రబాబు అధికారంలోకి రావడం, ఆర్థిక కష్టాలు, రాజధాని నిర్మాణం, సంస్కృతి తదితరాలపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇప్పటికే షార్ట్ ఫిల్ములు తయారు చేశారు. అంతేనా.. ఆ మట్టిని తొలుత గ్రామాల నుంచి సమీపంలోని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలకు తీసుకొస్తారు. వాటికి అడుగడుగునా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అటు అనంతపురం ఇటు శ్రీకాకుళం నుంచి అమరావతి జ్యోతులకు శ్రీకారం చుడుతున్నారు. అవి వచ్చే ప్రతి గ్రామంలోనూ హడావుడి చేయనున్నారు. గ్రామోత్సవాలతోపాటు గ్రామ జ్యోతులతో నవ్యాంధ్ర వ్యాప్తంగా సెంటిమెంటును పూర్తిస్థాయిలో పిండాలని కంకణం కట్టుకున్నారు.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండడానికి కూడా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దాదాపు లక్ష మంది అని చెబుతున్నా అంతకు ఎక్కువే వచ్చేలా చేస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లా నుంచి ప్రజలను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంమీద, రాజధాని నిర్మాణం, శంకుస్థాపన ద్వారా నవ్యాంధ్రలో సెంటిమెంటును పిండాలని చంద్రబాబు పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నారు.
Tags:    

Similar News