బాబు న్యూ టీం : మెంబ‌ర్లు వీరేనా?

Update: 2015-09-27 07:46 GMT
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు టీంలో మార్పులు - చేర్పులపై ప్రభుత్వంలో - తెలుగుదేశం పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వివిధ కార‌ణాలు, చంద్ర‌బాబు బిజీ వ‌ల్ల ఆ ప్ర‌క్రియ ముందుగు సాగ‌లేదు. దసరా రోజున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ఖరారైంది. అప్పటి నుంచే పూర్తి స్థాయిలో బెజవాడ కేంద్రంగా పాలన సాగించాలని నిశ్చయించుకున్నారు. కేబినెట్‌ విస్తరణకూ ఇదే 'మంచి' సమయంగా చంద్ర‌బాబు భావిస్తున్నారని స‌మాచారం. పైగా అధికారంలోకొచ్చి పదిహేను నెలలైన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. మంత్రి వర్గ కూర్పు - ప్రస్తుత అమాత్యుల శాఖల్లో మార్పులు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రక్షాళనకు చంద్ర‌బాబు నడుంకట్టినట్లు తెలిసింది. అంతరంగికుల సహాయంతో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తు మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు.

ప్రత్యేక హోదాతో సహా విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రజల్లో ఆందోళనలు మొద‌ల‌య్యాయి. భూసేకరణ - భూసమీకరణలపై నిరసనలొస్తున్నాయి. ఈ సమస్యలను సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు - ప్రతిపక్షాలను ధీటుగా తిప్పికొట్టేందుకు కొత్త టీం అవసరమని బాబు యోచిస్తున్నారని స‌మాచారం. మ‌రోవైపు పలువురు మంత్రుల పని తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.  ప్రస్తుతం చంద్రబాబుతో కలిపి కేబినెట్‌ లో 20 మంది మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మందిని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. దాని ప్రకారం మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది. అయినా అంత మందిని తీసుకో డానికి చంద్రబాబు సుముఖంగా లేరు. అలాగని ఉన్న వారిలో కొందరిని తప్పించాలన్న ఆలోచన ఇప్పటికి లేదంటున్నారు. శాఖల మార్పు, ఒకరిద్దరిని కొత్తగా తీసుకుంటారని సమాచారం. మరీ త‌ప్ప‌నిస‌రి అయితే ఒకరిద్దరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రధానంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును కేబినెట్‌ లో తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. మొదటి నుంచీ ఆయన స్పీకర్‌ పదవిపై అయిష్టంగా ఉన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఆరోగ్యశాఖ పనితీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లడవుతున్న తరుణంలో గతంలో ఆ శాఖను నిర్వహించిన అనుభవం ఉన్న - స్వయంగా డాక్టర్‌ కూడా అయిన కోడెలను కేబినెట్‌ లోకి తీసుకొని ఆరోగ్యశాఖ ఇస్తారంటున్నారు. అయితే స్పీకర్‌ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం సస్పెన్స్ గా ఉంది. ప్ర‌త్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న వ్యవసాయ - అనుబంధ శాఖల్లో కొన్నింటిని విడదీసి కామినేని శ్రీనివాస్‌ కు అప్పగిస్తారని సమాచారం. ఎమ్మెల్సీల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు - పయ్యాల కేశవ్‌ - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి - తొండెపు దశరథ జనార్ధనరావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే యనమల - నారాయణ మంత్రులుగా ఉన్నందున ఎక్కువ మంది ఎమ్మెల్సీలకు పదవులివ్వడం ఇబ్బందికరమని బాబు సంకటంలో పడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన్ని తొలగించకపోయినా గాలి ముద్దుకృష్ణమనాయుడిని కేబినెట్‌ లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్‌ మంత్రి నారాయణ శాఖలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. సీఆర్‌ డీఎను ఆయన నుంచి తప్పిస్తారని, ప్రత్యేక శాఖను ఏర్పరచి, మంత్రినీ పెడతారని చెబుతున్నారు. కెఈ కృష్ణ‌మూర్తి - నిమ్మకాయల చిన‌రాజ‌ప్ప‌ - పీతల సుజాత‌ - మృణాళిని - పరిటాల సునీత‌పై సీఎంకు అసంతృప్తి ఉన్నా వారిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిసింది.
Tags:    

Similar News