బాబుకు ఫ‌లించ‌ని వ‌ర్క‌వుట్.. విష‌యం ఏంటంటే!

Update: 2020-10-14 02:30 GMT
టీడీపీని లైన్‌లో పెట్టాలి. పూర్వ వైభ‌వం తీసుకురావాలి. దీనికి ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తాను..అన్న‌ట్టుగానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు బాగానే క‌ష్టించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంపైనా అధ్య‌యనం చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో పార్టీ దూకుడు పెరిగిందా? కొత్త ర‌క్తం ఏరులై ప్ర‌వ‌హించి.. టీడీపీకి జ‌వ‌స‌త్వాలు పంచుతుందా? అంటే.. ఖ‌చ్చితంగా దూకుడు పెరుగుతుంది.. ఇందులో ఎలాంటి సందేహం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇంకేం.. చంద్ర‌బాబు ఆశ‌లు నెర‌వేరిన‌ట్టే క‌దా.. ఆయ‌న అనుకున్న‌ది సాధించిన‌ట్టే క‌దా..? అంటున్నారా? ఇక్క‌డే అస‌లు సిస‌లు ట్విస్ట్ ఉంది.

దీనికి కార‌ణం.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్న త‌ర్వాత‌.. అంద‌రినీ క‌లుపుకొని పోతాన‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు ప‌దే ప‌దే హామీ ఇచ్చారు. దీంతో పార్టీలో ఏనిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌ను సంప్ర‌దించే తీసుకుంటార‌ని అనుకున్న నేత‌ల‌కు ఇప్పుడు ఎదురు దెబ్బ‌త‌గిలింది. కేవ‌లం య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, త‌న కుమారుడు లోకేష్ బాబుల‌తో సంప్ర‌దించిన చంద్ర‌బాబు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ద‌వులు పంచేశారు అని ఇపుడు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో స్థానికంగా ఇప్ప‌టికే ఉన్న నాయ‌కులకు వారు ఒక్క మాట కూడా చెప్ప‌లేదట. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు పార్టీ జెండా మోసిన నాయ‌కులు, జిల్లా ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారు.. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌లుగా ఉన్న వారు పార్టీకి దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. తొలగించిన వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి ప్లాన్ చేయకుండానే కొత్త కమిటీలు నిర్ణయించేసి ప్రకటించడం పార్టీకి నష్టం చేస్తోందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ఇదే విష‌యంపై రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు బ‌చ్చ‌య్య చౌద‌రి ఆఫ్‌ది రికార్డుగా ఓ వ్యాఖ్య చేశారు. ``మా పార్టీలో అన్నీ బాబే. ఆయ‌నే సుప్రీం. మేం చెప్పినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అలా ప‌ట్టించుకుని ఉంటే.. మేం ఇలా ఉండేవాళ్లం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రికి టికెట్లు ఇవ్వొద్ద‌ని నేనే స్వ‌యంగా చెప్పా.. ఎవ‌రు ప‌ట్టించుకున్నారు. మాకు కొత్త వింత‌గా ఉంటుంది.``అని ఒకింత ప‌రుషంగానే వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. రాజ‌మండ్రి పార్ల‌మెంటు నియోక‌వ‌ర్గం చీఫ్‌గా జ‌వ‌హ‌ర్‌ను నియ‌మించారు. ఈ విష‌యం క‌నీసం ఎమ్మెల్యేలుగా ఉన్న ఆదిరెడ్డి భ‌వానీకి గానీ, బుచ్చ‌య్య‌కు గానీ తెలియ‌క‌పోవ‌డం.

ఇలా ఒక్క‌చోట మాత్ర‌మే కాదు.. విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం‌లో.. మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాంకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు చంద్ర‌బాబు. అయితే, ఈ విష‌యం విజ‌య‌వాడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బుద్దా వెంక‌న్న‌కు తెలియ‌ద‌ట‌. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి కూడా హింట్ ఇవ్వ‌లేదు. ఇక‌, తూర్పు ఎమ్మెల్యే పార్టీలో కీల‌క నేత గ‌ద్దె రామ్మోహ‌న్‌కు కూడా మాట మాత్ర‌మైనాచెప్ప‌లేదు. ఇలా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలా ఉండడంతో ఇప్ప‌టి వ‌ర‌కు జెండా మోసిన వారు దూర‌మ‌య్యే ఛాన్స్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో ఈ ప‌రిణామాల‌నుగ‌మ‌నిస్తే.. బాబు వ‌ర్క‌వుట్స్ చేసినా. ఫ‌లించ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News