చింతమనేనినే ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు!

Update: 2019-11-19 07:09 GMT
అధికారంలో ఉన్నప్పుడు అనుచితంగా వ్యవహరించి, ప్రస్తుతం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చింతమనేని ప్రభాకర్ ను జైల్లో పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ఏ స్థాయిలో హల్చల్ చేశారో అందరికి తెలిసిన సంగతే.

బూతులు తిట్టడం, కొట్టడం వంటివి చేశారాయన. దళితులను తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడారు కూడా. అలాగే కాంగ్రెస్ హయాంలో ఒక మంత్రిపై భౌతిక దాడి చేశారు చింతమనేని. ఆ వ్యవహారంలో ఆయనకు జైలు శిక్ష కూడా పడింది. దానిపై స్టే తెచ్చుకున్నారు. అయితే కేసు విచారణ సాగుతూ ఉంది.

తెలుగుదేశం హయాంలోనే చింతమనేనిపై నమోదు అయిన కేసులు యాభై వరకూ ఉన్నాయని తెలుస్తోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయాకా చింతమనేని బాధితులు అనేక మంది బయటకు వచ్చారు. ఆ కేసుల జాబితా పెరుగుతూ పోతోంది. అది వందకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తూ ఉన్నారు పరిశీలకులు.

ఇక చింతమనేనికి రిమాండ్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేరు ఆ తెలుగుదేశం నేత. ఇలాంటి నేపథ్యంలో ఆయన పరామర్శకు వెళ్లారు చంద్రబాబు నాయుడు. పరామర్శించడమే కాకుండా, చింతమనేని ప్రభాకర్ ను ఆదర్శంగా తీసుకోవాలని తన పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుమూలంగా ఏం చెబుతున్నట్టు? జైళ్లకు వెళ్లే స్థాయిలో తప్పులు చేయాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఉద్బోధిస్తూ ఉన్నారా?
Tags:    

Similar News