బన్నీని వెంటాడుతున్న ‘‘11’’

ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎదురుదెబ్బలు అల్లు అర్జున్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Update: 2024-12-25 05:43 GMT

ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎదురుదెబ్బలు అల్లు అర్జున్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ సినీ రంగ చరిత్రలో మరే హీరోకు లభించని భారీ సక్సెస్ పుష్ప2తో వచ్చినప్పటికీ.. ఆ సంతోషాన్ని సెకను కూడా ఎంజాయ్ చేయలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 విడుదలకు ముందు ప్రదర్వించిన ప్రీమియర్ షోకు ఆయన.. కుటుంబంతో పాటు వెళ్లటం.. ఆ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళా అభిమాని మరణించటం.. ఆమె కుమారుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ లో చికిత్స పొందటం తెలిసిందే. చావు బతుకుల మధ్య పోరాడుతున్న బాలుడ్ని సేవ్ చేసేందకు కిమ్స్ వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా పోలీసు విచారణకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చిన అల్లు అర్జున్ దాదాపు 3.45 గంటలు ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు ఆసక్తికరంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ పోస్టును చదివినంతనే షేర్ చేసేలా ఉన్న ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. ఈ పోస్టును అల్లు అర్జున్ కూడా చూస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం.

ఇంతకీ ఆ పోస్టులో ఏమున్నదంటే.. అల్లు అర్జున్ కు ‘‘11’’ నెంబరు కలిసి రావట్లేదన్నది సారాంశం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో మే 11న వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించేందుకు నంద్యాల వెళ్లటం తెలిసిందే. ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కావటంతోనే అల్లు అర్జున్ వెళ్లినట్లుగా వివరణ ఇచ్చినప్పటికీ.. మెగా అభిమానులతో పాటు జనసైనికులు సైతం తీవ్రంగా హర్ట్ అయ్యారు.

ఇది జరిగింది మే 11. అప్పటి నుంచి ఆయన్ను ‘‘11’’ సంఖ్య వెంటాడుతున్నట్లుగా పేర్కొన్న సదరు పోస్టులో ఇంకేం ఉందంటే.. డిసెంబరు నాలుగున సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన రేవతి మరణించిన విషయాన్ని వైద్యులు పదకొండు గంటల వేళలో నిర్దారించినట్లు సమాచారం. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ కావటం.. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను 11 గంటలకు విచారణకు రావాలని కోరటాన్ని ప్రస్తావించారు.యాద్రశ్చికంగా ఇవన్నీ జరిగినా.. 11 నంబర్ అల్లు అర్జున్ కు కలిసి రావట్లేదన్న రీతిలో ఉన్న ఈ పోస్టు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ అంశం మీద మాట్లాడుకునేలా చేస్తోంది.

Tags:    

Similar News