అప్పట్లో గుంతల రోడ్లు.. ఇప్పుడు నల్లగా మెరిసే రోడ్లు
ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.
సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో.. మౌలిక సదుపాయాల కల్పన కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో ఏ మాత్రం బ్యాలెన్సు మిస్ అయినా మొదటికే మోసం వస్తుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ప్రజలకు వ్యక్తిగతంగా మేలు చేసే సంక్షేమ పథకాల కారణంగా కలిగే ఆనందం అలానే నిలిచి.. ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగేలా చేయాలనుకున్నప్పుడు.. రోజువారీగా వారికి ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతూ ఉండాలి.
ఈ విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వ్యవహరించారు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. రోడ్ల విషయంలో వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరు పక్క రాష్ట్రాల్లోనూ చర్చగా మారేది. గుంతలతో నిండిన రోడ్ల మీద ప్రయాణం చేసేటోళ్లకు చుక్కలు కనిపించేవి. తెలుగువారికి పెద్ద పండుగులైన సంక్రాంతి.. దసరా సందర్భంగా ఏపీకి వచ్చే వారు.. ఇక్కడి రోడ్లను చూసి ముక్కున వేలేసుకునే వారు. రోడ్లను ఇంత అధ్వానంగా ఉండటమా? అంటూ మండిపడేవారు.
ఏపీ రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని అప్పట్లో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్ సైతం.. మీడియా సమావేశంలో పిట్టకథలా చెప్పి ఏపీ పరువు తీసిన సంగతి తెలిసిందే. రోడ్ల విషయంలో అప్పటి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. తామే సొంతంగా రోడ్లు వేసే కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయటం.. తన జనసైనికుల చేత గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.
ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత.. ఏపీ వ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితి మీద ఫోకస్ చేయటమే కాదు..రోడ్లను వీలైనంత మెరుగ్గా ఉండేలా తయారు చేసే అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం పల్లె పండుగ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రతి గ్రామంలోనూ రోడ్లు. సీసీ రోడ్లు.. తారు రోడ్లు వేయించారు. తాము వేసిన రోడ్లను ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ పలు చోట్ల ఓపెన్ చేయటం తెలిసిందే. తాజాగా.. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. గతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతయబలు వరకు రెండు కిలోమీటర్ల తారు రోడ్డును నిర్మించారు. పచ్చటి అడవిలో నల్లగా మెరిసిపోతున్న రోడ్లను డిప్యూటీ సీఎం ఆఫీసు షేర్ చేసింది. తమ ముందు ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉండేవి? అన్న అంశానికి సంబంధించి తేడా ఇట్టే అర్థమయ్యేలా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.