జగన్ పాలనను ఎండగట్టేందుకు బాబు వారి ప్రజా చైతన్య యాత్రలు

Update: 2020-02-18 09:15 GMT
తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండమంటే ఉంటాయా చెప్పండి? ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరి తొమ్మిది నెలల వ్యవధిలోనే.. ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన అసంతృప్తితో ఉన్నారంటూ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్న తీరును ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.

‘‘వైసీపీ అరాచక.. అసమర్త.. అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాలు.. ప్రజలను మోసగిస్తున్న తీరు.. వాటివల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించటానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపడుతున్నాను’’ అని తన అధికారిక ట్విట్టర్ పేజీలో ప్రకటించారు.

తాను షురూ చేస్తున్న ప్రజా చైతన్య యాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ బాబు కోరుతున్నారు. ‘‘తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రజా సంఘాలు ఈ ప్రజా చైతన్య యాత్రలో పాలుపంచుకొని వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల్ని ఎండగట్టాలి. ప్రభుత్వ బాధితులకు అండగా మనమున్నామనే భరోసా కల్పించాలని కోరుతున్నారు. రండి.. చైతన్యయాత్రను విజయవంతం చేయండి’’ అని కోరారు. ఇదిలా ఉంటే.. బాబు చేసిన ట్వీట్ కు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు.. అభిమానులు.. ఆయన్ను గో హెడ్ అని.. ఆల్ ద బెస్ట్ అని ప్రోత్సహిస్తుంటే.. మరికొందరుమాత్రం తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బాబు ఎన్నియాత్రలు చేసినా రాష్ట్రం లో నమ్మే వారు ఎవరూ లేరంటూ రీట్వీట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన షెడ్యూల్ పై బాబు ఎలాంటి ట్వీట్ చేయకున్నా.. టీడీపీ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా ఒక పోస్టు పెట్టింది. 45 రోజులు.. 13 జిల్లాలు.. 100 నియోజకవర్గాల్ని కవర్ చేసేలా ఈ ప్రజా చైతన్య యాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ షెడ్యూల్ అధికారికమైతే.. ఎండలు ముదిరే నాటికి తనయాత్రను చంద్రబాబు ముగించే వీలుందని చెప్పాలి. మరీ.. యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Tags:    

Similar News