అమరావతి తీర్పుపై స్పందించిన చంద్రబాబు

Update: 2022-03-03 16:30 GMT
అమరావతిపై హైకోర్టు తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళగిరిలో సర్పంచ్ ల సదస్సులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు...ఆ తీర్పుపై స్పందించారు. ఈ రోజు అమరావతి రైతులు సాధించిన విజయం 5 కోట్ల మంది ఆంధ్రుల విజయమని చెప్పారు.

ఈ స్ఫూర్తిదాయక విజయంపై అమరావతి రైతులను, ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అమరావతిలో ముస్లింలు, హిందువులు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారని...ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని వివరించారు.

ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రజలదేనని వెల్లడించారు.

పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చే భూమికి చాలా సెంటిమెంట్ ఉంటుందని, ఆ భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడం మామూలు విషయం కాదని చెప్పారు. ప్రజలలు, ప్రధాని వంటి పెద్దల ఆశీస్సులతో భూమి పూజ చేస్తే...వైసీపీ అధికారంలోకి రాగానే మూడు ముక్కలాటకు తెరలేపిందని మండిపడ్డారు.

అమరావతిలో ఒక్క ఎకరం ముంపునకు గురైందా? అని ప్రశ్నించారు. ఇది శ్మశానం, ఎడారి అని అన్నారని,కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని ఈ విధంగా అనడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నై, హైదరాబాద్ లకంటే అమరావతి భూమే గట్టిదని నిపుణులు వెల్లడించారని గుర్తు చేశారు. జగన్ వంటి దుర్మార్గులు వస్తారనే ఆనాడు సీఆర్డీయే చట్టం తెచ్చామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించామని వెల్లడించారు.

రాజధాని కోసం 807 రోజులుగా రైతులు పోరాడుతున్నారని, అందుకని రైతులను కొట్టారని, మహిళల జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని బాధపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి రైతులు...జగన్ సర్కార్ పై పోరాడి విజయం సాధించారని కొనియాడారు.

ఇప్పటివరకు చేసిన దానికి వైసీపీ నేతలు చరిత్రహీనులుగా చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు ఎవరిచ్చారని, తప్పుడు కేసులు పెడితే భయపడబోమని, ప్రజలందరూ తిరగబడితే ఈ పోలీసులు ఏమవుతారని నిలదీశారు.
Tags:    

Similar News