ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు స్పంద‌న‌

Update: 2021-09-21 01:30 GMT
ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌లేద‌ని అంటున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు తొలి రోజు స్పందించ‌నే లేదు. ఒక రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత స్పందించ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక వార్త కావ‌డంలో వింత లేదు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కానీ, లోకేష్ కానీ స్పందించ‌క‌పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

అయితే ఎట్ట‌కేల‌కూ చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఈ స్పంద‌న మీడియాతో డైరెక్టు సంభాష‌ణ కాదు. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో టీడీపీ స్ట్రాట‌జిక్ మీటింగ్ జ‌రిగింద‌ట‌. అందుకు సంబంధించి మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు ఏం చెప్పార‌నేది ఆ లీకు సారాంశం.

ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల విష‌యంలో టీడీపీ పాత వాద‌న‌నే వినిపించారు చంద్ర‌బాబు నాయుడు. త‌మ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాము పోటీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నార‌ట‌. అయితే ఘ‌న విజ‌యం సాధించిన‌ట్టుగా జ‌గ‌న్ చెప్పుకుంటున్నార‌ని చంద్ర‌బాబు నాయుడు స్పందించార‌ట‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌మ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు నాయుడు స‌వాల్ విసిరార‌ట‌.  అలాగే ఏపీలోని ప‌రిస్థితుల‌పై రొటీన్ విమ‌ర్శ‌ల‌ను యాడ్ చేశారు చంద్ర‌బాబు నాయుడు.

అయినా.. చంద్ర‌బాబు నాయుడు వాద‌న సాంకేతికంగా రైట్ కాదు. ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ అనేది నామినేష‌న్లు దాఖ‌లు చేసిన త‌ర్వాత జ‌రిగేది కాదు. నామినేష‌న్ల దాఖ‌లు, ఉప‌సంహ‌ర‌ణ వంటి ప్ర‌క్రియ అంతా ముగిసిన త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు బ‌హిష్క‌ర‌ణ పిలుపును ఇచ్చారు. బ‌హిష్క‌రించే ఉద్దేశం ఉంటే.. నామినేష‌న్లే దాఖ‌లు చేయ‌లేదు. పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని గమ‌నించే చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించార‌నేది చిన్న పిల్లాడికి కూడా అర్థం అవుతుంది. అయితే అప్ప‌టికే ప‌రిస్థితి చేయిదాటింది. ప్ర‌తి బ్యాలెట్ మీదా టీడీపీ గుర్తు అచ్చ‌య్యింది. అది జ‌రిగాకా.. బ‌హిష్క‌రించ‌డం అనేది ఉత్తుత్తి మాటే. అలాగే చాలా చోట్ల టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు చంద్ర‌బాబు పిలుపును ప‌ట్టించుకోకుండా విజ‌యం కోసం త‌మ వంతు ప్ర‌య‌త్నం చేశారు. వారిలో కొంద‌రు గెలిచారు, కొంద‌రు ఓట‌మి పాల‌య్యారు. ఈ విష‌యం క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు చూసిన వారికీ తెలుసు. అయినా తాము బ‌హిష్క‌రించిన‌ట్టుగా న‌మ్మించాల‌ని చంద్ర‌బాబు నాయుడు చాలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంత‌కు మించి ఈ ఫ‌లితాల‌పై స‌మాధానం ఏమీ లేన‌ట్టుంది ఇవ్వ‌డానికి!
Tags:    

Similar News