ఎట్ట‌కేల‌కు ఐల‌య్య దిగొచ్చారుగా!

Update: 2017-09-12 10:22 GMT
ఏదో ఒక సంచ‌ల‌న అంశంతో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే ప్ర‌ముఖ విద్యావేత్త‌, ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య షెఫ‌ర్డ్ తాజాగా వైశ్యుల‌ను కించ‌ప‌రుస్తూ రాసిన పుస్త‌కం తీవ్ర సంచ‌ల‌న సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పుస్త‌కం దుమారం రేపుతోంది. వైశ్యులు రోడ్ల మీద‌కి వ‌చ్చి.. ఐల‌య్య‌రాసిన `సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు` పుస్త‌క ప్ర‌తుల‌ను చించి త‌గ‌ల‌బెడుతున్నారు. అదేస‌మ‌యంలో ఐల‌య్య‌పై క‌ఠిన చ‌ట్టాల ప్ర‌కారం కేసులు న‌మోదు చేసి శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ ప‌రిణామం అటు తెలంగాణ‌, ఇటు ఏపీ ప్రభుత్వాల‌ను ఇరుకున పెట్టింది.

నిన్న సోమ‌వారం రోజు రోజంతా వైశ్యులు ఐల‌య్య‌కు వ్య‌తిరేకంగా భారీ ఎత్తున రెండు రాష్ట్రాల్లోనూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 2019 ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న త‌రుణంలో ఇటు వైశ్యుల‌ను వెనుకేసురాలేక పోతే ఏంజ‌రుగుతుందో న‌ని, అలాగ‌ని ఐల‌య్య‌పై కేసు పెట్టి చ‌ర్య‌లు తీసుకుంటే ద‌ళిత వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుందేమోన‌ని రెండు ప్ర‌భుత్వాలూ తీవ్ర‌స్థాయిలో మ‌థ‌న ప‌డ్డాయి. ఇక రోజు రోజుకూ ఈ నిర‌స‌న‌లు పెరుగుతుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. ఐల‌య్య‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

మీ అభిప్రాయాలు వెల్ల‌డించ‌డం త‌ప్పుకాక‌పోయిన‌ప్ప‌టికీ.. కొన్ని సున్నిత వ్య‌వ‌హారాల్లో.. సున్నిత‌మైన వ్యాఖ్య‌ల‌నే వినియోగిస్తే బాగుంటుందిక‌దా?  స్మ‌గ్ల‌ర్లు - కోమ‌టోళ్లు.. అనే పెద్ద పెద్ద ప‌దాల‌తో కించ ప‌రిస్తే.. ప్ర‌భుత్వాలు ఎలా స్పందించాలో మీరే చెప్పండి! అని ఐల‌య్య‌కు ఫోన్‌ లోనే క్లాస్ ఇచ్చిన‌ట్టు అమ‌రావ‌తి వ‌ర్గాలు చెబుత‌న్నాయి. దీంతో ఐల‌య్య కూడా దిగివ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.  2007లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం తాజా పుస్తకం అని చెప్పారు.

ప్రస్తుతం వైశ్య సామాజిక వర్గంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇతర సామాజిక వర్గాలతో కలిసి వ్యాపార భాగస్వామ్యం పంచుకునే పరిస్థితులు వచ్చాయని, వైశ్య సామాజిక వర్గంపై ఇప్పుడు పుస్తకం రాయాల్సి వస్తే, మారిన పరిస్థితులకు తగినట్టుగానే రాస్తానని  చెప్పారు. తన పుస్తకంపై సుహృద్భావ వాతావరణంలో చర్చించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ పుస్తకం టైటిల్, అంశాలు మార్చేందుకు తాను సిద్ధమని, ఆర్యవైశ్య ప్రతినిధులు వస్తే చర్చించి మార్పులు చేస్తానని చెప్పారు.

మ‌రోప‌క్క‌, రాష్ట్రంలో వైశ్యులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై సీఎం చంద్రబాబు డీజీపీతో క‌లిసి స‌మీక్షించారు.  కులాల మధ్య చిచ్చుపెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  మ‌రి ఈ వివాదం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి. గ‌తంలోనూ ఐల‌య్య ఆవు ఆహార జంతువా?  ఆర్థిక జంతువా? ఆధ్యాత్మిక జంతువా? అంటూ వివాదం రేపారు. బ్రాహ్మ‌లు తిండిపోతులు! ఉత్ప‌త్తిలో వారికి స్థానం లేద‌ని ర‌గ‌డ సృష్టించారు. కాబ‌ట్టి.. రాబోయే రోజుల్లో ఐల‌య్య ఇంకెలాంటి వివాదాల‌కు కేంద్ర బిందువు అవుతారో చూడాలి.
Tags:    

Similar News